Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ లోకి రిటైర్డ్ సీఎస్ ఎంట్రీ..ఎవరంటే?

By:  Tupaki Desk   |   17 March 2020 11:51 AM GMT
జగన్ సర్కార్ లోకి రిటైర్డ్ సీఎస్ ఎంట్రీ..ఎవరంటే?
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..మరో మాస్టర్ ప్లాన్ తో చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ మధ్య వైసీపీ ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. సీఎం కి తెలియకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంతో ఇరు పార్టీల నేతలు ఒకరిపై విమర్శలు చేసుకుంటున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించారని బలంగా నమ్ముతున్న వైఎస్ జగన్ ... సరికొత్త ఆలోచనతో ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.

బాబు దారిలోనే వెళ్లి ..బాబుకి షాక్ ఇవ్వాలని చూస్తున్న జగన్ ...తన సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిని తెర మీదికి తీసుకురాబోతున్నట్టు సమాచారం. అసలు ఈ రమాకాంత్ రెడ్డి ఎవరు అని అనుకుంటున్నారా ...అయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అయన చాలా కీలక శాఖల్లో పనిచేశారు. అలాగే వైఎస్‌ కు అత్యంత నమ్మకస్తుడు. పదవీ విరమణ చేసిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన తెలంగాణ క్యాడర్ కి వెళ్లారు.

వైఎస్ జగన్‌ పై నమోదైన ఆస్తుల కేసు వ్యవహారంలో రమాకాంత్ రెడ్డి తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. జగన్‌ పై నమోదైన ఏ ఒక్క కేసు నిలబడదని - తండ్రి హయాంలో ఆయన ఏనాడూ సచివాలయానికి కూడా రాలేదంటూ బహిరంగంగానే మద్దతు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనితో తాజాగా ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రమాకాంత్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ తో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో రమాకాంత్ రెడ్డి ఎన్నికల కమిషనర్‌ గా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల పై ఆయన సలహాలను తీసుకున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో.. నిర్దేశిత గడువులోగా ఎలాగైనా ఎన్నికలను నిర్వహించడానికి ఎలాంటి మార్గాలను అన్వేషించాలనే విషయంపై రమాకాంత్ రెడ్డి - సీఎంకు కొన్ని సలహాలను ఇచ్చారని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.