Begin typing your search above and press return to search.

మా మ‌ఠంలో రాజ‌కీయ ప్ర‌సంగ‌మా.. మోడీపై అసంతృప్తి

By:  Tupaki Desk   |   13 Jan 2020 5:30 PM GMT
మా మ‌ఠంలో రాజ‌కీయ ప్ర‌సంగ‌మా.. మోడీపై అసంతృప్తి
X
ఎక్క‌డ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. రాజ‌కీయాల‌కు దూరంగా సేవా భావంతో న‌డిచే సంస్థ‌ల‌కు వెళ్లిన‌పుడు ఎంత‌టి వాళ్ల‌యినా నియంత్ర‌ణ పాటించాలి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ సంగ‌తి మ‌రిచారు. రామ‌కృష్ణ మిష‌న్‌కు వెళ్లి రాజ‌కీయ ప్ర‌సంగం చేశారు. దీని పై మ‌ఠం నిర్వాహ‌కులు బ‌హిరంగం గానే అ సంతృప్తి వ్య‌క్తం చేశారు. కోల్ కతాలోని  రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠంలో ప్రధాని మోదీ చేసిన ప్ర‌సంగం ప‌ట్ల‌ మఠం సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఈ మఠంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ..  పౌరసత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం ప్ర‌స్తావ‌న తెచ్చారు. ఈ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ చట్టం పౌరసత్వాన్ని ఇచ్చేందుకే తప్ప..లాక్కోవడానికి కాద‌ని కూడా ఆయన అన్నారు.
 
అయితే మ‌ఠంలో అందునా విద్యార్థుల‌నుద్దేశించి మోడీ ఇలా మాట్లాడ‌టాన్ని నిర్వాహ‌కులు త‌ప్పు బ‌ట్టారు. ఏ రాజకీయ పార్టీకీ నెలవు కాని, సంబంధం లేని తమ మఠంలో ఆయన రాజకీయ ప్రసంగం చేయడంలో ఔచిత్యం లేదని, ఇందుకు  తామెంతో మనస్తాపం చెందుతున్నామని మఠం సభ్యుడు గౌతమ్ రాయ్,  ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానంద అన్నారు. ఇది రాజకీయ వేదిక కాద‌ని...ఆ విధమైన ప్రకటనలు చేయడానికి ప్రధానికి ఇక్కడ అనుమతి లేద‌ని.. కొన్నేళ్లు గా త‌మ కార్యాలయం రాజ‌కీయాల‌కు వేదిక‌ గా మారుతోంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాము త‌మ‌ ఇళ్లను, కుటుంబాలను వదిలి మోక్షం ఆశించి.. నిష్కల్మషమైన ఈ చోటికి వచ్చామ‌ని, అనుచితమైన పిలుపులు, ప్రసంగాలను అనుమతించబోమని వారు స్ప‌ష్టం చేశారు.