Begin typing your search above and press return to search.

అసత్యానికి ఏడేళ్ల జైలు.. రూ.5 కోట్ల జరిమానా

By:  Tupaki Desk   |   9 April 2015 11:00 AM GMT
అసత్యానికి ఏడేళ్ల జైలు.. రూ.5 కోట్ల జరిమానా
X
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసులో ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ బైర్రాజు రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఆయన సోదరుడు రామరాజుకు కూడా ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఈ కేసులో మొత్తం పది మంది దోషులు ఉన్నారు. వీరిలో చాలామందికి ఏడేళ్ల శిక్ష పడింది. మొదటి దోషి రామలింగరాజు కావడంతో ఆయన మీద తీర్పు వెలువడింది. ఇప్పటికే ఆయన 33 నెలల పాటు రిమాండు ఖైదీగా ఉన్నారు కాబట్టి మిగిలిన కాలానికి ఆయన జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. హైకోర్టులో మాత్రమే బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. ఉంది. ఆయనతో పాటు మొత్తం పది మంది దోషులకు కూడా ఏడేళ్ల జైలుశిక్షనే విధించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు మినహా మిగిలిన దోషులకు మాత్రం రూ. 25 లక్షల చొప్పున జరిమానా విధించారు. దోషులను నేరుగా కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది.

దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి తన తీర్పును ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంస్థ చైర్మన్‌ రామలింగరాజును న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్‌, ఎస్‌.గోపాలకృష్ణన్‌, తాళ్లూరి శ్రీనివాస్‌, సూర్యనారాయణ రాజు, సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణ, వీఎస్‌ ప్రభాకర్‌ గుప్తా, ఫైనాన్స్‌ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్‌ శ్రీశైలంపై నేరం రుజువైంది.