Begin typing your search above and press return to search.

రెడ్డి గారి మాట‌!... ఎంఐఎంతో బీజేపీ మిలాఖ‌త్‌!

By:  Tupaki Desk   |   29 Jan 2018 10:02 AM GMT
రెడ్డి గారి మాట‌!... ఎంఐఎంతో బీజేపీ మిలాఖ‌త్‌!
X
2019లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌ గా భావిస్తున్న క‌ర్ణాట‌క శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌ల స‌మ‌య‌మే ఉంది. సార్వ‌త్రికానికి సెమీస్‌ గా ప‌రిగ‌ణిస్తున్న ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌త్తా చాటి క‌న్న‌డ నాట అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ వ్యూహాలు ర‌చిస్తుంటే... కేంద్రంలో మ‌రోమారు అధికారంలోకి రావాలంటే క‌న్న‌డ నాట కాంగ్రెస్ స‌ర్కారును కూల్చి క‌మ‌ల ద‌ళాన్ని గ‌ద్దెనెక్కించాల్సిందేన‌న్న కోణంలో బీజేపీ కూడా ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఇప్ప‌టికే ప‌లు మార్లు క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించ‌గా... కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. మూడు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారో? ఎవ‌రు ఓడ‌తారో? తెలియ‌దు గానీ... ఆ ఎన్నిక‌ల పుణ్య‌మా అని సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మొన్న‌టిదాకా కాంగ్రెస్ లో మిస్ట‌ర్ క్లీన్‌ గానే ఉన్న క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌... ఇటీవ‌లి కాలంలో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. మిస్ట‌ర్ క్లీన్‌ గా ఉండి అవినీతిప‌రుడిగా మారిపోయిన సీఎం వ్య‌వ‌హార స‌ర‌ళే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని బీజేపీ నేత‌లు గంపెడాశ‌లు పెట్టుకున్న‌ట్లుగానూ విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

అయితే బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొట్టే విష‌యంలో ఏమాత్రం అల‌క్ష్యం చేయ‌ని సిద్ద‌రామ‌య్య... ఇటు క‌న్న‌డ బీజేపీ నేత‌ల‌తో పాటు అటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల‌పై త‌న‌దైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కాకుండానే క‌న్న‌డ‌నాట హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం బెంగ‌ళూరులో మీడియా ముందుకు వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ నేత - క‌ర్ణాట‌క హోం శాఖ మంత్రి రామ‌లింగారెడ్డి... బీజేపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. క‌ర్ణాట‌కలో బ‌లంగా త‌న‌ను ఓడించ‌డం సాధ్యం కాద‌ని తెలుసుకున్న బీజేపీ... దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఆరోపించారు. నేరుగా వ‌స్తే.. త‌మ‌ను ప‌డ‌గొట్టడం సాధ్యం కాద‌ని తెలుసుకున్న క‌మ‌ల‌నాథులు... దొడ్డిదారి మార్గాలు వెదుక్కుని... గ‌తంలో ఎన్న‌డూ లేని నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు కూడా చెప్పిన రెడ్డి గారు.. కన్న‌డ‌నాట త‌మ‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న బీజేపీ...తన‌కు బ‌ద్ధ శ‌త్రువుగా ఉన్న హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ పార్టీ అయిన మ‌జ్లిస్‌ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. హిందువుల‌కు ప్ర‌తినిధిగా త‌న‌ను తాను చెప్పుకునే బీజేపీ... హిందూత్వాన్ని వ్య‌తిరేకించ‌డంతో పాటుగా ఉగ్ర‌వాదుల‌కు అండ‌గా నిలిచే ఎంఐఎంతో ఎలా పొత్తు పెట్టుకుంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అయినా ఎంఐఎంతో బీజేపీ పొత్తు క‌న్న‌డ‌నాటే కొత్తేమీ కాద‌ని చెప్పిన ఆయ‌న... ఉత్తర ప్రదేశ్ లో గత సంవత్సరం జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీతో కుమ్మక్కు అయ్యి ముస్లీం సోదరులు ఎక్కవగా ఉంటున్న ప్రాంతాల్లో పోటీ చేయించారని, అక్కడ ముస్లీం ఓట్లు చీలిపోవడంతో బీజేపీ నాయకులు గెలిచారని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. యూపీలో అమ‌లు చేసిన వ్యూహాన్నే క‌న్న‌డ నాట కూడా అమ‌లు చేసేందుకు బీజేపీ య‌త్నిస్తోందని మండిప‌డ్డ రెడ్డి... బీజేపీ ఎన్ని కుయుక్తులు ప‌న్నినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని కూడా ధీమా వ్య‌క్తం చేశారు.