Begin typing your search above and press return to search.

బాబు ర‌మ‌ణ‌దీక్షితుల‌కు జూనియ‌ర్!

By:  Tupaki Desk   |   18 July 2018 6:46 AM GMT
బాబు ర‌మ‌ణ‌దీక్షితుల‌కు జూనియ‌ర్!
X
జూనియ‌ర్.. సీనియ‌ర్ లాంటి ప‌దాలు కాలం చెల్లిన‌విగా చెబుతుంటారు. అయితే.. త‌ర‌చూ ఈ మాట‌ల్ని ఉప‌యోగిస్తూ.. త‌న గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు టీటీడీ ప్ర‌ధాన ఆర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు అనుకోని రీతిలో అన్న మాట ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. బాబుకు భ‌లే పంచ్ ప‌డిందేన‌న్న మాట వినిపిస్తోంది.

దేశంలో ఉన్న సీఎంల‌లో తాను సీనియ‌ర్ ను.. తన గొప్ప‌త‌నం గురించి ప‌లు సంద‌ర్భాల్లో బాబు చెప్పుకున్న బ‌డాయి మాట‌లు తెలుగు వారికి త‌ర‌చూ గుర్తుకు వ‌స్తుంటాయి.

ప్ర‌పంచంలో ఏదైనా స‌రే.. త‌న గొప్ప‌త‌నం త‌ర్వాతే అన్న‌ట్లుగా బాబు మాట‌లు ఉంటాయి. ఇదిలా ఉంటే.. టీటీడీ చేప‌ట్టిన మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం వివాదాస్ప‌దం కావ‌టం.. భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాల్ని నిలిపివేయ‌టంపై వెల్లువెత్తిన నిర‌స‌న‌ల‌తో ఏపీ స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌టం.. టీటీడీ సైతం త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై ర‌మ‌ణ‌ దీక్షితులు మాట్లాడారు. గ‌డిచిన కొద్ది రోజులుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ర‌మ‌ణ‌ దీక్షితులు తాజాగా త‌న వాయిస్ ను కాస్త డౌన్ చేయ‌టం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు మ‌న‌సులో ఏమీ లేద‌ని.. కొంద‌రు ప్రోద్బ‌లంతోనే త‌న ప‌ట్ల ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త ఏర్ప‌డింద‌న్నారు. గ‌తంలో తానుచేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ.. భ‌క్తుల నుంచి స్పంద‌న క‌రువైంద‌ని.. కొండ‌మీద ఉన్న అర్చ‌కుల‌కు మ‌ద్ద‌తు ల‌భించ‌టం లేద‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

మ‌హాసంప్రోక్ష‌ణ సంద‌ర్భంగా ద‌ర్శ‌నాలు ఆపేయ‌టం స‌రికాద‌న్నారు. ప‌రిమిత సంఖ్య‌లో అయినా ద‌ర్శ‌నాలకు అనుమ‌తించాల‌న్నారు. ఇదే విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు తాజాగా ప్ర‌క‌టించ‌టాన్ని గుర్తుచేశారు. టీటీడీ బోర్డులో ఉన్న వారంతా రాజకీయ నాయ‌కులేన‌ని.. దైవ‌చింత‌న‌.. సంస్కారం.. దేవాల‌యాల మీద న‌మ్మ‌కం.. హిందూ సంప్ర‌దాయాల‌పై విశ్వాసం లేనివారేన‌న్నారు.

సీఎం చంద్ర‌బాబునుక‌లిసేందుకు తాను ప్ర‌య‌త్నించాన‌ని.. ఆయ‌న అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా వెన‌క్కి పంపార‌న్నారు. ఇప్పుడు అనుమ‌తించినా తానుక‌లుస్తాన‌న్నారు. చంద్ర‌బాబు త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుస‌ని.. ఎస్వీ యూనివ‌ర్సిటీలో బాబు త‌న‌కు జూనియ‌ర్ గా బాగా తెలుస‌న్నారు.

కొంద‌రి కార‌ణంగా ఆయ‌న త‌న ప‌ట్ల వ్య‌తిరేకంగా ఉన్నారే కానీ బాబు మ‌న‌సులో ఏమీ లేద‌న్నారు. తామంతా స్వామి భ‌క్తుల‌మేన‌న్న ర‌మ‌ణ‌దీక్షితులు.. తాను అర్చ‌కుడిన‌ని.. అంద‌రూ బాగుండాల‌ని కోరుకుంటాన‌న్నారు. అంద‌రిని త‌న కంటే జూనియ‌ర్లు అని చెప్పే బాబునే.. త‌న‌కు జూనియ‌ర్ అని ర‌మ‌ణ‌దీక్షితులు చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.