Begin typing your search above and press return to search.

గెస్ట్ హౌస్ కు వ‌చ్చి క‌లిసిన ఆయ‌న‌కు జ‌గ‌న్ భ‌రోసా ఏంటి?

By:  Tupaki Desk   |   29 May 2019 4:59 AM GMT
గెస్ట్ హౌస్ కు వ‌చ్చి క‌లిసిన ఆయ‌న‌కు జ‌గ‌న్ భ‌రోసా ఏంటి?
X
తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఎదురైంది. ఒక‌ప్పుడు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఒక వెలుగు వెలిగిన ర‌మ‌ణ‌దీక్షితులు త‌ర్వాతి కాలంలో ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయారో తెలిసిందే. ప్ర‌ముఖులు వ‌చ్చిన‌ప్పుడు అవ‌స‌రానికి మించిన అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. కుటుంబ స‌భ్యుల్ని (మ‌న‌వ‌ళ్ల‌తో స‌హా) నేరుగా మ‌హాద్వారం నుంచి ఆల‌యంలోకి ప్ర‌వేశించేలా ఏర్పాట్లు చేయ‌టం.. రెండేళ్లుగా విధుల్లో లేని త‌న కొడుక్కి సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై విధులు కేటాయించ‌టం లాంటి వివాదాలెన్నింటిలోనో పేరున్న ర‌మ‌ణ‌దీక్షితుల్ని ఏపీ ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టేసింది.

త‌న‌కు ఎదురైన ఇబ్బందుల్ని ఏక‌రువు పెట్టుకునేందుకు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చిన ర‌మ‌ణ‌దీక్షితుల‌కు సాంత్వ‌న ప‌లికారు జ‌గ‌న్‌. తాజాగా ప‌వ‌ర్లోకి వ‌చ్చిన జ‌గ‌న్ ను ఆయ‌న క‌ల‌వ‌టం తెలిసిందే. తాజాగా తిరుమ‌ల‌కు వ‌చ్చిన జ‌గ‌న్ ను.. ర‌మ‌ణ దీక్షితులు స్వ‌యంగా ఆయ‌న గెస్ట్ హౌస్ కు వ‌చ్చారు. త‌న‌ను ఆల‌యంలోకి రానివ్వ‌టం లేద‌ని జ‌గ‌న్ వ‌ద్ద ర‌మ‌ణ దీక్షితులు పేర్కొన్న‌ట్లుగా తెలిసింది. టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కుడి బాధ్య‌త‌ల నుంచి త‌న‌ను తొల‌గించిన తీరు మీద పున‌రాలోచించాల‌న్న ఆయ‌న‌.. టీటీడీలో అవినీతి.. అక్ర‌మాలు. ఆగ‌మ‌శాస్త్ర ఉల్లంఘ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తిరుమ‌ల‌లో జ‌రిగిన త్ర‌వ్వ‌కాల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు స్వాగ‌తం ప‌లికిన తీరుతోపాటు.. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామితో చ‌ర్చ‌లు జ‌రిపిన వైనంతో టీడీపీ ప్ర‌భుత్వం అప్ప‌ట్లో ఆయ‌న మీద వేటు వేసింది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో టీటీడీలో చోటు చేసుకున్న ప‌లు అక్ర‌మాల‌ను జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

దీనికి స్పందించిన జ‌గ‌న్‌.. (బుధ‌వారం) ఆల‌యంలో క‌లుద్దామ‌ని చెప్ప‌టంతో ర‌మ‌ణ‌దీక్షితుల‌కు ఉన్న ఇబ్బందులన్ని తొల‌గిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న‌ను ఆల‌యంలోకి రానివ్వ‌టం లేద‌న్న ర‌మ‌ణ దీక్షితుల‌కు.. తాను చూసుకుంటాన‌ని జ‌గ‌న్ చెప్ప‌టంతో.. గ‌డిచిన కొంత కాలంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌వేశానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ర‌మ‌ణ దీక్షితుల‌కు లైన్ క్లియ‌ర్ కావ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను అడ్డుకునే వారెవ‌రూ ఉండ‌ర‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.