Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ర‌మ‌ణ దీక్షితులు ఆమ‌ర‌ణ దీక్ష‌?

By:  Tupaki Desk   |   22 May 2018 9:25 AM GMT
ఢిల్లీలో ర‌మ‌ణ దీక్షితులు ఆమ‌ర‌ణ దీక్ష‌?
X
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ)బోర్డుకు - తిరుమ‌ల ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులైన ర‌మణ దీక్షితులు ల మ‌ధ్య వివాదం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేదు. ఆలయ ప్రధాన అర్చకులైన రమణదీక్షితులతో సహా నలుగురు ప్రధాన అర్చకులను టీటీడీ పాల‌క‌మండ‌లి హ‌ఠాత్తుగా తొల‌గించ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌మ శాస్త్రాల‌కు వ్య‌తిరేకంగా తిరుమ‌ల‌లో జ‌రుగుతోన్న విష‌యాల‌పై ర‌మ‌ణ దీక్షితులు చేసిన ఆరోప‌ణ వ‌ల్లే ఆయ‌న‌పై వేటు ప‌డింది. ఆయన వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్న టీటీడీ బోర్డు పాల‌క‌మండ‌లి..... 65ఏళ్లకే రిటైర్మెంట్ అంటూ హ‌ఠాత్తుగా కొత్త నిబంధ‌న‌ను సాకుగా చూపి ర‌మ‌ణ దీక్షితుల‌ను ప‌దవి నుంచి తొలగించింది. తిరుమ‌ల‌లో ఆగ‌మ శాస్త్రాల‌కు విరుద్ధంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌శ్నించిన ర‌మణ దీక్షితులును చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అడ్డుతొల‌గించుకుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ...ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వ‌దంతులు వ‌స్తున్నాయి. టీటీడీలో అవ‌క‌త‌వ‌కలు - అక్ర‌మాల‌పై విచార‌ణ‌కు డిమాండ్ చేస్తూ ర‌మ‌ణ దీక్షితులు ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగ‌బోతున్నార‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

తిరుమ‌ల‌లో స‌మాచారం లేకుండా ప్రాచీన కట్టడాలను పున‌ర్నిర్మించ‌డం....ఆగమ శాస్త్రానికి విరుద్ధమని ర‌మ‌ణ‌దీక్షితులు చెబుతున్నారు. అందులోనూ, ప్ర‌త్యేకించి శ్రీవారి వంటశాలలో నేలమాళిగల కోసం మ‌ర‌మ్మ‌త‌లపేరుతో 22 రోజుల పాటు తవ్వకాలు చేపట్టినట్లు రమణ దీక్షితులు ఆరోపించారు. తిరుమ‌ల‌లో మిస్ అయిన కోట్లు విలువ చేసే పింక్ డైమండ్ విదేశాల్లో వేలానికి రావ‌డం ఏమిట‌ని ఆయన ప్ర‌శ్నించారు. ఈ ఆరోప‌ణ‌లు చేసిన వెంట‌నే ఆయ‌న‌ను టీటీడీ పాల‌క‌మండ‌లి తొల‌గించింది. దీంతో, టీటీడీలో అక్రమాలపై విచారణకు డిమాండ్ చేస్తూ ర‌మ‌ణ దీక్షితులు ఆమరణ దీక్షకు దిగ‌బోతున్నారని వార్తలు వస్తున్నాయి. త‌న వ్య‌క్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోన్న చంద్రబాబు స‌ర్కార్ తీరుకు నిర‌స‌న‌గా ఢిల్లీలో అమరణ దీక్షకు దిగుతానని ఆయన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారంలో సీబీఐ విచార‌ణ కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆయ‌న వినతిపత్రం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం చినికిచినికి గాలివానలా మార‌డంతో స్వ‌యంగా చంద్ర‌బాబు....ఈ వివాదంపై దృష్టి సారించి స‌మీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది.