Begin typing your search above and press return to search.

ఆ త‌వ్వ‌కాల వెనుక అజ్ఞాత 'మేడ‌మ్' ఎవ‌రు?

By:  Tupaki Desk   |   20 Jun 2018 2:37 PM GMT
ఆ త‌వ్వ‌కాల వెనుక అజ్ఞాత మేడ‌మ్ ఎవ‌రు?
X
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులుకు - టీటీడీ బోర్డుకు మ‌ధ్య ఏర్ప‌డ్డ వివాదం ఇప్ప‌ట‌ల్లో స‌ద్దుమ‌ణిగేలా లేదు. టీటీడీ బోర్డులో జ‌రుగుతోన్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై - ఆగ‌మ శాస్త్రాల‌కు విరుద్ధంగా జ‌రుగుతోన్న ప‌నుల‌పై తాను నోరు మెదిపినందుకే ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌పై క‌క్ష్య తీర్చుకుంటున్నార‌ని ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీవారి పోటులోని నేలమాళిగలలో ఉన్న‌విలువైన ఆభ‌రాణాల‌కోసం జ‌రిగిన త‌వ్వ‌కాల వెనుక చంద్ర‌బాబు హ‌స్త‌ముంద‌ని కొద్ది రోజుల క్రితం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తవ్వ‌కాల‌కు అనుగుణంగా త‌న అనుయాయుల‌ను చంద్ర‌బాబు టీటీడీ బోర్డులో నియ‌మించుకున్నారని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా, చంద్ర‌బాబుతో పాటు మ‌రో `మేడ‌మ్` ఉత్త‌ర్వుల ప్ర‌కార‌మే ఆ త‌వ్వ‌కాలు జ‌రిగాయ‌ని ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

డిసెంబ‌రు 8, 2017 నుంచి జ‌న‌వ‌రి 3 - 2018 వ‌ర‌కు మొత్తం 25 రోజులపాటు శ్రీ‌వారి పోటును మూసివేశార‌ని ర‌మ‌ణ దీక్షితులు అన్నారు. ఆల‌యంలో ఏ ప‌ని జ‌రిగినా నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌ధాన అర్చ‌కుడి హోదాలో త‌న‌కు స‌మాచారం అందించాల‌ని, కానీ ఆ తవ్వ‌కాల గురించి త‌నకు చెప్ప‌లేద‌ని అన్నారు. తాను అడిగితే....ఏవో చిన్న రిపేర్లు ఉన్నాయ‌ని చెప్పి త‌ప్పించుకున్నార‌ని అన్నారు. జ‌న‌వ‌రి 3 త‌ర్వాత తాను శ్రీ‌వారి పోటు లోకి వెళ్లి చూస్తే....ఫ్లోర్ అంతా త‌వ్వి మ‌ళ్లీ టైల్స్ ప‌రిచిన‌ట్లుగా ఉంద‌ని చెప్పారు. ఇదే విష‌యాన్ని అప్ప‌టి టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి రాజు దృష్టికి తీసుకువెళితే....త‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని చెప్పారు. సీఎం చంద్ర‌బాబు తో పాటు మ‌రో `మేడం` ఆదేశాల ప్ర‌కార‌మే ఆ తవ్వ‌కాలు జ‌రిగాయ‌ని, ఇక‌పై ఈ విష‌యం గురించి మాట్లాడ‌వ‌ద్ద‌ని త‌నను హెచ్చ‌రించార‌ని అన్నారు. అయితే, ఆ మేడ‌మ్ ఎవ‌ర‌నేది త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. భ‌యంతో తాను కూడా ఆ వ్య‌వ‌హారం గురించి నోరు విప్ప‌లేక‌పోయాన‌ని అన్నారు. పురాత‌న తాళ‌ప‌త్ర‌ గ్రంథాల ప్రకారం శ్రీ‌వారి ఆల‌యం మొద‌టి ప్రాకారం కింద వంద‌ల‌ కోట్ల విలువ జేసే వ‌జ్ర వైఢూర్యాలు, నిధులు ఉన్నాయ‌ని, వాటికోస‌మే త‌వ్వ‌కాలు జ‌రిపి ఉంటార‌ని ర‌మ‌ణ దీక్షితులు చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ విచార‌ణకు కేంద్రం ఆదేశించ‌ని ప‌క్షంలో జులై నుంచి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగుతాన‌ని హెచ్చ‌రించారు.