Begin typing your search above and press return to search.

రమణ రాజీనామా.. కారెక్కడం ఖాయం

By:  Tupaki Desk   |   9 July 2021 7:35 AM GMT
రమణ రాజీనామా.. కారెక్కడం ఖాయం
X
టీఆర్ఎస్ నుంచి బీసీ అయిన ఈటల రాజేందర్ వెళ్లిపోయారు. ఇప్పుడా స్థానంలోకి అదే బీసీ, చేనేత వర్గానికి చెందిన ఎల్.రమణను తీసుకురావాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు నిన్న మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణను రప్పించారు. అయితే చర్చలు ముగిసి బయటకు వచ్చినా రమణ టీఆర్ఎస్ లో చేరలేదు. కేసీఆర్ కండువా కప్పలేదు. కేసీఆర్ హామీ ఇచ్చినా ఏం చేయాలో పాలుపోక రమణ తన నిర్ణయాన్ని నిన్న వాయిదా వేశాడు. ఈరోజు టీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు..

నిన్న ప్రగతి భవన్ కు వెళ్లి ఎల్.రమణ సీఎం కేసీఆర్ ను కలిశారు. చర్చించారు. టీఆర్ఎస్ లో చేరికపై వివిధ హామీలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నామని ఎల్.రమణ తెలిపారు.

ఈ క్రమంలోనే సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలని కేసీఆర్ చెప్పారని.. తనతోపాటు కలిసి రావాలని కేసీఆర్ కోరినట్లు ఎల్.రమణ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. దీనికి సానుకూలంగా నిర్ణయం ఉంటుందని కేసీఆర్ కు చెప్పానని ఎల్.రమణ మీడియాకు వివరించారు.

ఇక ఎరబ్రెల్లి కూడా మాట్లాడారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ అవసరం టీఆర్ఎస్ కు ఉందన్నారు. రమణను టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని.. రమణ సానకూలంగా స్పందించారన్నారు.

కాగా రమణ ఈరోజు టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో అధికారికంగా టీఆర్ఎస్ లో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఈయనకు ఏ పదవి ఇస్తాడన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

అయితే కేసీఆర్ స్వయంగా పార్టీలోకి రమ్మంటే ఎవరైనా ఎగిరి గంతేసి కండువా కప్పుకుంటారు. కానీ ఎల్.రమణకు కేసీఆర్ గురించి బాగా తెలుసు. మొదట ఇచ్చిన ప్రాధాన్యం తర్వాత టీఆర్ఎస్ లో ఉండదన్న విషయం తెలిసినట్టుంది. ఇప్పటికే సీనియర్లు టీఆర్ఎస్ లో ఎటూకాకుండా పోయారన్న అపప్రద ఉంది. అందుకే ఎల్.రమణ ఖచ్చితమైన హామీ.. కేసీఆర్ మాటలపై నమ్మకంతోనే టీఆర్ఎస్ లో చేరడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది..