Begin typing your search above and press return to search.

రేపు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోనున్న రమణ

By:  Tupaki Desk   |   11 July 2021 4:30 PM GMT
రేపు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోనున్న రమణ
X
ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఎల్.రమణ రేపు టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఉ.11.30 గంటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు.

అనంతరం ఈనెల 16వ తేదీన తన సహచరులతో పాటు సీఎం కేసీఆర్ సమక్షంలో రమణ టీఆర్ఎస్ లో చేరనున్నారని సమాచారం. ఇందుకోసం తన అనుచరులను, అభిమానులను సమీకరిస్తున్నారట.. కాగా మూడు రోజుల క్రితం ప్రగతి భవన్ లో ఆయన సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే.

తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి ఇటీవలే గుడ్ బై చెప్పారు. టీడీపీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజానామా చేసేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఎల్.రమణ పంపారు. టీఆర్ఎస్ నుంచి బీసీ అయిన ఈటల రాజేందర్ వెళ్లిపోయారు. ఇప్పుడా స్థానంలోకి అదే బీసీ, చేనేత వర్గానికి చెందిన ఎల్.రమణను తీసుకురావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణను రప్పించారు. అయితే చర్చలు ముగిసి టీఆర్ఎస్ లో చేరికకు ఎల్.రమణ ఒప్పుకున్నారు.

సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలని కేసీఆర్ చెప్పారని.. తనతోపాటు కలిసి రావాలని కేసీఆర్ కోరినట్లు ఎల్.రమణ నిన్న చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. దీనికి సానుకూలంగా నిర్ణయం ఉంటుందని కేసీఆర్ కు చెప్పానని ఎల్.రమణ మీడియాకు వివరించారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు ఎల్. రమణ రెడీ అయ్యారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు ఈ సందర్భంగా రమణ కృతజ్ఞతలు తెలుపడం విశేషం. తనను నాయకుడిని చేసిన చంద్రబాబును పార్టీ వీడుతూ కూడా రమణ స్మరించుకున్నారు.

రమణ ఎగ్జిట్ తో తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యే ప్రమాదంలో పడింది. తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు డిసైడ్ అయిపోయారు. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసేశారు. రేపు టీఆర్ఎస్ లో చేరి సభ్యత్వం తీసుకోనున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల్.రమణ పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కన్వీనర్ గా, మంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ తోపాటు బీజేపీ నేతలు ఎల్. రమణతో చర్చలు జరుపుతున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ వైపే వెళ్లడానికి ఎల్. రమణ డిసైడ్ అయ్యారు.