Begin typing your search above and press return to search.

ఆది అడ్డాలో రామసుబ్బారెడ్డికి ఎంట్రీ అవసరమా?

By:  Tupaki Desk   |   9 May 2016 10:06 AM GMT
ఆది అడ్డాలో రామసుబ్బారెడ్డికి ఎంట్రీ అవసరమా?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రమాదకరమైన ఆటకు తెర తీశారు. ప్రధానప్రతిపక్షం లేకుండా చేయాలన్న వ్యూహంలో భాగంగా ఒకే ఒరలో రెండు కత్తుల్ని ఉంచే ప్రయత్నం చేయటం తెలిసిందే. పలు జిల్లాల్లో ఏమాత్రం పొసగని వర్గాల్ని పార్టీలోకి తీసుకురావటమే కాదు.. వారి మధ్యనున్న విభేదాలు సమిసిపోవాలని.. వారంతా కలిసి మెలిసి పార్టీ కోసం పని చేయాలంటూ నాలుగు మాటలు చెప్పేసి పంపటం తెలిసిందే. అధినేత ముందు ఓకే అన్నప్పటికీ.. వారి మధ్య ఉండే పంచాయితీలు ఒక కొలిక్కి రావటం లేదు. దీంతో.. ఈ నేతల మధ్య తరచూ ఏదోఒకటి చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా చూస్తే.. కడపజిల్లాలో ఉప్పు నిప్పులా ఉండే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి.. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిల్ని కలిపే ప్రయత్నం చంద్రబాబు చేసినా.. వారి మధ్య విభేదాలు మాత్రం ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఇప్పుడు ఇద్దరూ ఒకేపార్టీలో ఉన్న ఎడముఖం పెడ ముఖమే తప్పించి కలిసి ఉండని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యుత్సాహంతో చేసే పనులు మరింత ఇబ్బందికి గురి చేస్తుంటాయి.

తాజాగా ఆదినారాయణ రెడ్డికి మంచి పట్టున్న బొరిగెనూరు పర్యటనకు వెళ్లిన రామసుబ్బారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన పర్యటనను నిరసిస్తూ ఆది వర్గానికి చెందిన కార్యకర్తలు రామసుబ్బారెడ్డి ముఖం మీదనే తలుపులు వేయటం గమనార్హం. తనకు పట్టున్న గ్రామాల్లో తన అనుమతి లేకుండా రామసుబ్బారెడ్డి ఎలా పర్యటిస్తారంటూ ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కదిలించి గొడవలు తెచ్చుకోవటం అంటే దీన్నే అంటారేమో? అధిపత్య పోరు నడిచే ఇద్దరు నేతల మధ్య సఖ్యత పెంచాలంటే.. వారి మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా ఏర్పాటు చేయాలి. ఆ విషయంలో బాబు ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు. మరి.. తాజా పంచాయితీ ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.