Begin typing your search above and press return to search.

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల తిండి కొట్లాట

By:  Tupaki Desk   |   11 April 2016 9:09 AM GMT
ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల తిండి కొట్లాట
X
కడపజిల్లా జమ్మలమడుగు టీడీపీలో ఉప్పునిప్పులా ఉన్న ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డిల విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. చిన్నచిన్న విషయాలకు - చిల్లర విషయాలకు కూడా వారు కొట్లాటలకు దిగుతుండడంతో వీరేం నేతలు అనుకుంటున్నారు స్థానికులు. తాజాగా ఇద్దరి మధ్య మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఒక విందు విషయంలో ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డిల మధ్య వైషమ్యాలను బహిర్గతం అయ్యాయి.

ఆదినారాయణరెడ్డికి ప్రాబల్యం వున్న పెదదండ్లూరు గ్రామంలో టీడీపీ లోకల్ లీడర్లు విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి రామసుబ్బారెడ్డిని కూడా ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణరెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. రామసుబ్బారెడ్డిని విందుకు ఎలా పిలుస్తారంటూ స్ధానికనేతలపై విరుచుకుపడ్డారు. మీ సంగతి తేలుస్తానంటూ తీవ్రస్ధాయిలో హెచ్చరించారని సమాచారం. ఆదినారాయణరెడ్డి హెచ్చరికతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అటు ఆదినారాయణరెడ్డి - ఇటు రామసుబ్బారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

రామసుబ్బారెడ్డికి ఇష్టం లేకపోయినా, తరతరాల ఫ్యాక్షన్ కక్షలను కూడా లెక్కచేయకుండా చంద్రబాబు ఆదినారాయణరెడ్డిని టీడీపీ లోకి చేర్చుకున్నారు. ఇకపై తాను రామసుబ్బారెడ్డితో కలసి పని చేస్తానని ఆదినారాయణరెడ్డి పలుమార్లు చెప్పారు. కానీ చేతల్లో మాత్రం ఆయన పనులకు పోంతన లేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిసి పనిచేస్తానన్న ఆదినారాయణరెడ్డి చివరకు రామసుబ్బారెడ్డిని విందుకు ఆహ్వనించడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని.. ఇద్దరూ కలిసి పనిచేయడం ఎలా సాధ్యమవుతుందని అంటున్నారు.