Begin typing your search above and press return to search.

ట‌పాసుల బ్యాన్‌.. హిందూ పండుగలే టార్గెట్

By:  Tupaki Desk   |   12 Oct 2017 10:52 AM GMT
ట‌పాసుల బ్యాన్‌.. హిందూ పండుగలే టార్గెట్
X
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎన్ సీఆర్ ప‌రిధిలో దీపావ‌ళి రోజు ట‌పాసుల్ని కాల్చ‌టంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు వెలువ‌రించిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. ఇప్ప‌టికే హిందువులు జ‌రుపుకునే ప‌లు పండుగ‌ల‌పై ఏదో ఒక ముద్ర వేస్తున్నార‌ని.. తాజాగా దీపావ‌ళి మీద కూడా ప‌రిమితులు విధిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ వాద‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు పతంజ‌లి వ్య‌వ‌స్థాప‌కుడు క‌మ్ యోగాగురువు రాందేవ్ బాబా. దీపావ‌ళి సంద‌ర్భంగా ట‌పాసుల్ని కాల్చే అంశంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. కేవ‌లం ఒక ప్ర‌త్యేక స‌మాజాన్ని మాత్ర‌మే టార్గెట్ చేశారంటూ మండిప‌డ్డ రాందేవ్‌.. హిందూ పండుగ‌ల‌పైనే నిషేధం విధించ‌టం త‌ప్ప‌న్నారు.

ఒక ప్రైవేటు ఛాన‌ల్‌ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. హిందూ పండుగ‌ల‌పై మాత్ర‌మే నిషేధం విధించ‌టం త‌ప్పు అని వ్యాఖ్యానించారు. ప్ర‌తి పండుగ‌ను కోర్టుల ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ల‌టం స‌రైన ప‌ద్ధ‌తేనా? అని ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా ట‌పాసులు ప్ర‌తిఒక్క‌రిపైనా ప్ర‌భావితం చేస్తాయంటూ మాజీ కేంద్ర‌మంత్రి శ‌శిథ‌రూర్ లాంటి వ్య‌క్తి వ్యాఖ్యానించ‌టం స‌రికాద‌న్నారు రాందేవ్‌. తాను స్కూళ్లు.. యూనివ‌ర్సిటీల‌ను న‌డిపిస్తున్నాన‌ని.. అక్క‌డ చేతితో ప‌ట్టుకొని కాల్చే ట‌పాసులకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ట‌పాసులు కాలిస్తే శ‌బ్ద‌.. వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంద‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తుంటే.. హిందువులు జ‌రిపే ప్ర‌తి పండ‌క్కి ఏదో ఒక రీతిలో కాలుష్యం మాట‌ను తెర మీద‌కు తెచ్చి సంప్ర‌దాయాన్ని దెబ్బ వేస్తున్నారంటూ ప‌లువురు మండిప‌డ‌టం గ‌మ‌నార్హం.