Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు రెడ్డి ఎమ్మెల్యేలు కూడా సైకిలెక్కేస్తారా!

By:  Tupaki Desk   |   4 Aug 2016 7:31 AM GMT
ఆ ఇద్ద‌రు రెడ్డి ఎమ్మెల్యేలు కూడా సైకిలెక్కేస్తారా!
X
నెల్లూరులో బ‌లంగా ఉంద‌ని భావిస్తూ వ‌చ్చిన విప‌క్ష వైకాపా ఖాళీ అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్ చంద్ర‌బాబు చెంత‌కు చేరి ప‌సుపు కండువా క‌ప్పేసుకున్నారు. దీనికి తోడు ఉన్న ఎమ్మెల్యేల్లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు... ఆధిప‌త్య ధోర‌ణి! దీంతో జిల్లాలో వైకాపా ప‌రిస్థితి దారుణంగా ఉంది. లెక్క‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు క‌నిపిస్తున్నా.. ఎప్పుడు ఎవ‌రు జంప్ చేసి సైకిలెక్కుతారో తెలియ‌ని స‌స్పెన్స్ వాతావ‌ర‌ణం. మ‌రో ప‌క్క కిందిస్థాయి కేడ‌ర్‌ లోనూ ఉత్సాహం క‌రువు. దీంతో మొత్తానికి నెల్లూరులో వైకాపాకు గడ్డు ప‌రిస్థితే ఉంది.

మ‌రోప‌క్క‌, ఇదే జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి - కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌ రెడ్డి టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రి నారాయణ వీరిద్ద‌రితో మంతనాలు సాగించి తేదీ కూడా ఖరారు చేశార‌ట‌. అయితే... ఏమయిందో కానీ, చివరి దశలో వారిద్దరూ వైకాపాలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. వీరిద్ద‌రూ వైకాపా అధినేత జ‌గ‌న్‌ కు న‌మ్మిన బంటులే. అయితే, ప‌రిస్థితుల‌ ప్ర‌భావం.. మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వీరు కూడా త్వ‌ర‌లోనే సైకిలెక్కేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీనికి న‌కీలీ మ‌ద్యం కేసు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. ప్ర‌స్తుతం విప‌క్షంలో ఉన్న వీరిద్ద‌రు ఎమ్మెల్యేల‌పై ఈ కేసు ప్ర‌భావం బాగానే క‌నిపిస్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే.. ఈ కేసు వీరికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

భ‌విష్య‌త్తులో విప‌క్ష ఎమ్మెల్యేలుగా త‌మ‌పై వేధింపులు మ‌రింత పెరుగుతాయ‌ని వీరు అంచ‌నా వేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే వైకాపాకు బైకాపా చెప్పి.. చంద్ర‌బాబు పంచ‌కు చేరిపోయే ప్లాన్‌ లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే, వైకాపా అధినేత జ‌గ‌న్ నెల్లూరులో గురువారం యువ భేరి నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో జిల్లాలో నెల‌కొన్న ప‌రిస్థితులపై ఆయ‌న ఏవిధంగా స్పందిస్తారో ? నేత‌ల‌కు ఏవిధంగా దిశానిర్దేశం చేస్తారో వేచి చూడాలి. అధికార పార్టీ ‘ఆకర్ష్‌’ పథకానికి కొందరు ముఖ్య నేతలు వలసబాట పడుతున్నారు. మరి కొందరు ‘సర్దుబాటు’ ధోరణిలో వ్యవహరిస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ చేసే కాయ‌క‌ల్ప చికిత్స‌పైనే అంద‌రి దృష్టి నెల‌కొంది. మ‌రి భ‌విష్య‌త్తులో నెల్లూరులో వైకాపా మ‌నుగ‌డ సాధించేందుకు జ‌గ‌న్ ఎలాంటి ఆక్సిజ‌న్ అందిస్తారో చూద్దాం.