Begin typing your search above and press return to search.

మాట‌ల బుల్లెట్ ట్రైన్‌.. రామ్మోహ‌న్ నాయుడు

By:  Tupaki Desk   |   21 July 2018 3:58 AM GMT
మాట‌ల బుల్లెట్ ట్రైన్‌.. రామ్మోహ‌న్ నాయుడు
X
ఉన్న‌ది త‌క్కువ స‌మ‌యం. చెప్పాల్సిన విష‌యాలు చాలానే ఉన్నాయి. ఇలాంట‌ప్పుడు ఏం జ‌రుగుతుంది? త‌త్త‌ర‌పాటుకు గురి కావ‌టం.. అయోమ‌యంతో గంద‌ర‌గోళానికి గురి కావ‌టం.. నోటి వెంట వ‌చ్చే మాట‌ల్లో తేడాలు.. మాట‌ల కోసం త‌డుముకోవ‌టాలు లాంటివి చోటు చేసుకుంటాయి. కానీ.. బుల్లెట్ ట్రైన్ మాదిరి.. ద‌డ‌ద‌డ‌లాడిస్తూ.. ఎక్క‌డా ఎలాంటి లోపం త‌లెత్త‌కుండా త‌న ప‌నిని తాను పూర్తి చేసుకెళ్ల‌ట‌మే కాదు.. మొద‌ట్లో ఎంపీ గ‌ల్లా మాట‌ల్ని గుర్తుకు తెచ్చేలా.. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై మ‌రింత ఎలుగెత్తి చాటేలా వ్య‌వ‌హ‌రంచారు టీడీపీ ఎంపీ కె. రామ్మోహ‌న్ నాయుడు.

మోడీ స‌ర్కారుపై త‌మ పార్టీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసంపై జ‌రిగిన చ‌ర్చ‌లో పాల్గొన్న ఆయ‌న‌కు.. చాలా త‌క్కువ వ్య‌వ‌ధి మాత్రమే ద‌క్కింది. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా తేడా రాని రీతిలో చెల‌రేగిపోయారు. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేయ‌ట‌మే కాదు.. బీజేపీ ద్వంద వైఖ‌రిని త‌న మాట‌ల‌తో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రారంభంలో ఏపీ ఎదుర్కొంటున్న ఇష్యూల గురించి.. ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్రం మాట త‌ప్ప‌టం గురించి నిల‌దీసిన‌ప్ప‌టికీ.. అనంత‌రం ఏ పార్టీకి ఆ పార్టీ త‌మ త‌మ అంశాల మీద దృష్టి పెట్ట‌టంతో ఏపీ ఇష్యూల‌న్ని ప‌క్క‌కు వెళ్లిపోయాయి. ఈ నేప‌థ్యంలో మాట్లాడే అవ‌కాశం ల‌భించిన రామ్మోహ‌న్ పుణ్య‌మా అని మ‌రోసారి ఏపీకి జ‌రిగిన అన్యాయం తెర మీద‌కు వ‌చ్చింది.

పూర్తిగా హిందీలో సాగిన రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌సంగంలో ప్ర‌ధాని మోడీని..కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ పైనా త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ని రామ్మోహ‌న్‌...త‌న ప్ర‌సంగంతో బీజేపీ నేత‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే.. ఆయ‌న మాట‌ల్ని క‌మ‌లనాథులు అస్స‌లు రియాక్ట్ కాకుండా ఉండిపోయారు.

ఆయ‌న ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు చూస్తే..

= తెలంగాణ‌.. క‌ర్ణాట‌క త‌ల‌స‌రి ఆదాయం చూడండి. వాళ్ల‌తో స‌మానంగా ఏపీ ముందుకు రావాల‌నే ప్ర‌త్యేక హామీల‌తో చ‌ట్టం చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని చూడండి. ఏడు అంత‌స్తుల్లో మూడు బ్లాక్ లు. 70 గ‌దులు అధునాత‌న స‌దుపాయాలు.. డిజిట‌ల్ లైబ్ర‌రీతో ఏడాదిన్న కాలంలో నిర్మించారు. కానీ..ఏపీలో ఐఐటీ.. ఎయిమ్స్ లాంటివి నాలుగేళ్ల‌లో ఎందుకు నిర్మించ‌లేదు? దీనికి మోడీ స‌మాధానం చెప్పాలి

= ‘రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థల కోసం ఎంతోమంది రైతులు భూములు త్యాగం చేశారు. ఆ సంస్థలు వస్తే పిల్లలకు చదువులు, ఉద్యోగాలు వస్తాయని వారు దాతృత్వం చూపారు. కానీ రూ.11వేల కోట్ల అవసరం అయిన విద్యాసంస్థలకు రూ.500 కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతాయి?

= ఇలా పోతే 80 ఏళ్లయినా అవి పూర్తికావు. అప్పటివరకు ఉండేదెవరు? చదువుకొనేదెవరు’? ఒక ప్రధానమంత్రి చేసిన వాగ్దానాన్ని మరో ప్రధాని అమలు చేయకపోతే ఎక్కడికెళ్లాలి? కోర్టుకెళ్తే ఎంత సమయం పడుతుందో మీకు(ప్రధానికి) తెలుసు.

= దేవాలయంలాంటి పార్లమెంటులో న్యాయం జరగకపోతే ఇంకెవరు చేస్తారు? ఇలా వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేయడం మాకూ ఇష్టంలేదు. కానీ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి తప్పడంలేదు.

= ‘‘రాజ్‌నాథ్‌సింగ్‌ తన ప్రసంగంలో ఎన్నో అబద్ధాలు చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే జోన్‌ గురించి బీజేపీ సభ్యుడు హరిబాబుకు బాగా తెలుసు. వాజ్‌పేయి హయాంలో 7 కొత్త రైల్వే జోన్లు ఏర్పాటుచేసినప్పుడు ఇప్పుడు ఒక్కటి ఏర్పాటుచేయలేరా?

= గతంలో వెంకయ్యనాయుడు చెప్పినట్లుగానే చందమామ రావే... అంటూ అదే అరిగిపోయిన రికార్డును మళ్లీమళ్లీ వినిపిస్తున్నారు. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని భాజపా మేనిఫెస్టోలోకూడా పెట్టారు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే చట్టాన్ని సవరించి ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపామని చెబుతున్నారు. అదే చొరవ ప్రత్యేకహోదా విషయంలో ఎందుకు తీసుకోవడంవలేదు?

= ప్రత్యేకహోదా ఈశాన్యరాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు? వాటినో కంట మమ్మల్నో కంట ఎలా చూస్తారు? విభజన చట్టం ఈ సభలోనే పాస్‌ అయింది కదా? దాని అమలు బాధ్యత కేంద్రానికి లేదా? విభజన చట్టాన్ని అమలుచేయాల్సిన నోడల్‌ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. ఆయనకానీ, ప్రధానమంత్రికానీ చట్టం అమలు ఎంతవరకు వచ్చిందని ఒక్కసారైనా సమీక్షించారా?

= మెట్రో విధానాల్ని మారుస్తూ ఒక‌రిపై ఒక‌రు చెప్పుకొంటున్నారు. డ‌బ్బులు భ‌రించాల‌ని ష‌ర‌తులు పెడుతున్నారు. రూ.16వేల కోట్ల లోటు బ‌డ్జెట్ తో ఉన్న ఏపీ ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవ‌ని అంద‌రికి తెలుసు. తెలంగాణ‌.. క‌ర్ణాట‌క త‌ల‌స‌రి ఆదాయం చూడండి.వాళ్ల‌తో స‌మానంగా ముందుకు రావాల‌నే ప్ర‌త్యేక హోదా చ‌ట్టం చేశారు. మేం కొత్త‌గా ఏమీ అడ‌గ‌టం లేదు. తిరుప‌తి.. గుంటూరు.. విశాఖ‌ప‌ట్నం స‌భ‌ల్లో మోడీ ఇస్తామ‌ని చెప్పిన‌వే అడుగుతున్నాం.

= ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించారు. ఐదేళ్లు కాదు ప‌దేళ్లు హోదా ఇవ్వాల‌ని రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య చెప్పారు. ఇప్పుడు మీరే ప్ర‌భుత్వంలోకి వ‌చ్చారు. మోడీ ప్ర‌ధాని అయ్యారు. ఇప్పుడేమో హోదా అంశం విభ‌జ‌న చ‌ట్టంలో లేదంటున్నారు. పోల‌వ‌రం ముంపు మండ‌లాల్ని ఏపీలో క‌లిపేందుకు చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసిన‌ట్లుగా.. ప్ర‌త్యేక హోదా కోసం చ‌ట్టాన్ని ఎందుకు స‌వ‌రించ‌కూడ‌దు?

= ఇంతవరకూ ఒక్క సమావేశం పెట్టలేదు. పెట్టి ఉంటే అందులో నిజమేంటో తెలిసి ఉండేది. రాష్ట్రానికి రూ.16వేల కోట్ల రెవెన్యూలోటు రావాలని కాగ్‌ చెబితే రూ.4వేల కోట్లు ఇచ్చామంటున్నారు. మిగతా రూ.12వేల కోట్లు ఎక్కడికెళ్లాయి? ప్రత్యేకహోదాకు - పన్నురాయితీలకు సంబంధం లేదని హరిబాబు అంటున్నారు. కానీ కేంద్ర వాణిజ్యశాఖ ప్రత్యేకహోదా ఉన్నరాష్ట్రాలన్నింటికీ పన్నురాయితీలు ఎలా కల్పించింది?’

= విశాఖ‌ప‌ట్నం- చెన్నై కారిడార్ కు పైసా ఇవ్వ‌లేదు. కానీ గుజ‌రాత్ మీదుగా వెళ్లే ఢిల్లీ- ముంబై పారిశ్రామిక కారిడ‌ద‌ర్ కు కేంద్రం రూ.17500 కోట్లు ఇచ్చింది. చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్ ప్రారంభం కాలేదు. కానీ.. గుజ‌రాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేష‌న్ ను కేంద్ర చ‌మురురంగ సంస్థ‌లు 24వేల కోట్ల భారం భ‌రించి తీసుకున్నాయి. ఊపీలో పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్ కు మాత్రం వ‌య‌బులిటీ గ్యాప్ ఫండింగ్ భ‌రించాలంటున్నారు. క‌డ‌ప ఉక్కుదీ ఇదే ప‌రిస్థితి. ఏదో ఒక కార‌ణం చెప్పి త‌ప్పించుకున్నారు.

= రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ఆమోదించి నాలుగేళ్లు అయ్యింది. మీ అంద‌రి స‌మ‌క్షంలో.. ఇదే స‌భ‌లో చేసిన చ‌ట్టం. దీనిని కేంద్రం ఎందుకు అమ‌లు చేయ‌దు? నాలుగేళ్ల‌లో దీనిపై ఒక్క‌సారైనా స‌మీక్షా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారా? విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వ‌లేదో ఒక్క కార‌ణం సూటిగా చెప్పండి?