Begin typing your search above and press return to search.

కుర్ర ఎంపీకి ద‌డ పుట్టిస్తున్న కిల్లి మేడ‌మ్‌!

By:  Tupaki Desk   |   21 Feb 2019 6:45 AM GMT
కుర్ర ఎంపీకి ద‌డ పుట్టిస్తున్న కిల్లి మేడ‌మ్‌!
X
ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చేసిన వేళ ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో అధికార‌పార్టీకి చుక్క‌లు క‌నిపిస్తున్న ప‌రిస్థితి. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ప‌చ్చ‌కండువాలు వేసుకొని హ‌డావుడి చేసిన వారు.. ఉన్న‌ట్లుండి బాబుకు గుడ్ బై సైతం చెప్ప‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.

ఈ ప‌రిణామాన్ని ఏ మాత్రం ఊహించ‌లేని బాబు బ్యాచ్ కు జ‌రుగుతున్నదేదీ ఒక ప‌ట్టాన మింగుడుప‌డ‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ పాతిక ఎంపీ సీట్లు త‌మ‌వేనంటూ కాన్ఫిడెన్స్ గా చెప్పే చంద్ర‌బాబుకు తాజా వ‌ల‌స‌లు నోటి వెంట మాట రానివ్వ‌ని ప‌రిస్థితి. పాతిక ఎంపీ సీట్ల‌లో కచ్ఛితంగా గెలుపు మీద న‌మ్మ‌కం ఉన్న సీట్ల‌లో శ్రీ‌కాకుళం లోక్ స‌భ స్థానం ఒక‌టిగా చెబుతుంటారు.

మాజీ కేంద్ర‌మంత్రి.. దివంగ‌త ఎర్ర‌న్నాయుడి కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం ఎంపీగా వ్య‌వ‌హరిస్తున్నారు. యువ‌కుడిగా.. ఆవేశ పూరిత ప్ర‌సంగాల‌తో పాటు.. త‌న వాద‌నా ప‌టిమ‌తో ఇప్ప‌టికే ప‌లువురు దృష్టిని ఆక‌ర్షించ‌టంతో పాటు.. త‌న హిందీ భాషా ప్రావీణ్యంతో ఏపీ వాద‌న‌ను ఢిల్లీకి అర్థ‌మ‌య్యేలా చేయ‌టంలో స‌క్సెస్ అయ్యార‌న్న పేరుంది.

హోదా ఇవ్వ‌కున్నా.. ఆ పేరుతో రామ్మోహ‌న్ నాయుడు ప‌డిన క‌ష్టం ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిసిందే. ఇదిలా ఉంటే.. శ్రీ‌కాకుళం జిల్లాలోని బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన కిల్లి కృపారాణి తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌టం రామ్మోహ‌న్ నాయుడికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తెచ్చి పెడుతుంద‌ని చెబుతున్నారు.

రామ్మోహ‌న్ నాయుడి ప‌ని తీరు మీద విమ‌ర్శ‌లు లేకున్నా..కిల్లి కృపారాణికి ఉన్న ఛ‌రిష్మా.. ఆయ‌న‌కు స‌మ‌స్య‌గా మారుతుంద‌ని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కిల్లి కృపారాణి ఎంట్రీ ఇవ్వ‌టంతో స్థానికంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారిపోయాయి.

మొన్న‌టి వ‌ర‌కూ శ్రీ‌కాకుళం వైఎస్సార్ కాంగ్రెస్ అంటే త‌మ్మినేని సీతారాంతో పాటు.. దువ్వాడ శ్రీ‌నివాస‌రావు పేర్లు మాత్ర‌మే వినిపించేవి. అయితే.. త‌మ్మినేని పోటీకి మొగ్గు చూప‌క‌పోవ‌టం.. దువ్వాడ బ‌రిలో ఉంటే రామ్మోహ‌న్ నాయుడి గెలుపు వీజీ అన్న మాట వినిపించేది.

అయితే.. తాజాగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గ నేప‌థ్యం ఉన్న కిల్లి కృపారాణి జ‌గ‌న్ పార్టీలో చేర‌టంతో రామ్మోహ‌న్ నాయుడి గెలుపు అంత ఈజీ కాద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. శ్రీ‌కాకుళం జిల్లాలో ఉన్న రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల్లో కిల్లి కృపారాణి సామాజిక వ‌ర్గం బ‌ల‌మైన‌దిగా చెప్పాలి. ఎలానంటే..1996లో ఏర్ర‌న్నాయుడు గెలవ‌టానికి ముందు జ‌రిగిన ఎన్నిక‌ల్లో తొమ్మిది సార్లు కిల్లి సామాజిక వ‌ర్గానిదే విజ‌యం వ‌రించేది. మ‌ధ్య‌లో 1967లో మాత్రం గౌతుల‌చ్చ‌న్న గెలుపొందారు.

ఎర్ర‌న్నాయుడి ఎంట్రీ త‌ర్వాత స‌మీక‌ర‌ణాలుకాస్త మారాయి. ఆయ‌న వ‌రుస‌గా నాలుగుసార్లు విజ‌యం సాధించారు. అయితే.. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కిల్లి కృపారాణి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఎర్ర‌న్నాయుడు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టం.. రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నెల‌కొన్న కాంగ్రెస్ వ్య‌తిరేక‌త‌తో ఆమె ఓట‌మిపాల‌య్యారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కిల్లి నిర్ణ‌యంతో జిల్లా స‌మీక‌ర‌ణాల్లో మార్పులు చోటు చేసుకోవ‌టం ఖాయ‌మంటున్నారు.

బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన కిల్లి వైఎస్సార్ కాంగ్రెస్‌ లో చేర‌టం.. అదే స‌మ‌యంలో జిల్లాలోని ప‌లాస‌.. పాత‌ప‌ట్నం.. శ్రీ‌కాకుళం.. ఇచ్చాపురం.. న‌ర‌స‌న్న పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ బ‌లంగా ఉండ‌టంతో రామ్మోహ‌న్ నాయుడికి చిక్కులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. మొన్న‌టివ‌ర‌కూ వీజీగా విజ‌యమ‌ని భావించిన దానికి భిన్నంగా ప‌రిస్థితులు మారిన‌ట్లుగా చెబుతున్నారు.