Begin typing your search above and press return to search.

గోరంట్లపై చర్యలకు వైసీపీ వెనుకాడుతోంది అందుకేనా? రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   9 Aug 2022 11:30 AM GMT
గోరంట్లపై చర్యలకు వైసీపీ వెనుకాడుతోంది అందుకేనా? రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు
X
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందిన ఒక ప్రైవేటు వీడియో బయటకు రావటం.. పెద్ద ఎత్తున కలకలం రేగటం.. అధికార వైసీపీకి ఈ వ్యవహారం భారీ షాకింగ్ గా మారటం తెలిసిందే. చాలా విషయాల్ని పట్టనట్లుగా.. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించే వైసీపీ.. గోరంట్ల మాధవ్ విషయంలో మాత్రం స్పందించక తప్పలేదు. ఈ ప్రైవేటు వీడియో అంశం వైరల్ గా మారిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. పరిశీలిస్తున్నామని.. నిజమని తేలితే చర్యలు తప్పవని చెప్పటం తెలిసిందే.

సోమవారం మరోసారి మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల మాట మారింది. గోరంట్ల మాధవ్ విషయంలో చర్యలు అవసరం లేదని.. అదో ప్రైవేటు వీడియో అని.. అందులో కనిపిస్తున్నది తనది కాదని మాధవ్ చెప్పారని.. మరే మహిళా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేదని.. బాధితులు లేనప్పుడు చర్యలు ఎలా తీసుకుంటామన్నట్లుగా సర్ది చెప్పిన వైనం చూస్తే.. గోరంట్ల మాధవ్ విషయాన్ని తమ పార్టీ సీరియస్ గా తీసుకోదన్న విషయాన్ని చూచాయగా చెప్పేశారు. ఇదిలా ఉంటే..తాజాగాఈ అంశంపై టీడీపీ ఎంపీ.. యువనేత రామ్మోహన్ నాయుడు స్పందించారు.

మాధవ్ ఎపిసోడ్ లో వైసీపీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేని విషయాన్ని ప్రశ్నిస్తూ.. భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. మాధవ్ అంశాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కంప్లైంట్ చేశామన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల మొదట్లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి సంబంధం లేదన్నరామ్మోహన్ నాయుడు.. ఇప్పుడు చర్యలకు భయపడుతున్నారన్నారు.

'మాధవ్ పై చర్యలు తీసుకుంటే ఆయన ఒక్కరే కాదు సగం మందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.వైసీపీ సగం ఖాళీ అవుతుంది. అందుకే భయపడుతున్నారు. వైసీపీ నేతల్లో చాలామందిపై అత్యాచార కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూశాం. ఇలాంటి నేతల్ని వైసీపీ ప్రోత్సహిస్తోంది.

మాధవ్ పై చర్య తీసుకుంటామని చెప్పి.. ఇప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి జగన్ ఆలోచనే" అంటూ మండిపడ్డారు.ఒక ఎంపీ వీడియో అలా వస్తే తమకు సిగ్గుచేటు అని.. అందుకే ఈ వ్యవహారంపై స్పీకర్ కు తాము ఫిర్యాదు చేశామని చెప్పారు.

ఆ వీడియో గురించి మాట్లాడాలంటే తమకే సిగ్గుగా ఉందన్నారు. పార్లమెంటు గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సాటి ఎంపీలుగా తమపై ఉందని.. అందుకే స్పీకర్ కు ప్రత్యేకంగా లేఖ రాసి.. చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా ఆయన చెబుతున్నారు. మరి.. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.