Begin typing your search above and press return to search.

వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

By:  Tupaki Desk   |   27 Sep 2020 5:00 PM GMT
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
X
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి.

వ్యవసాయ బిల్లులపై ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన తెలిపినప్పటికీ, మూజువాణి ఓటుతో బిల్లులను ప్రభుత్వం గెలిపించుకుంది. దీంతో ఈ వివాదాస్పద బిల్లులను ఆమోదించవద్దని కోరుతూ ప్రతిపక్షాలు రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించాయి. బిల్లులకు వ్యతిరేకంగా పలుచోట్ల రైతుల ఆందోళనలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి తన సమ్మతి తెలియజేశారు.

నాటకీయ పరిస్థితుల మధ్య వ్యవసాయ బిల్లులు ఉభయసభల ఆమోదం పొందడంతో వర్షాకాల సమావేశాలు ఇటీవల ముగిసాయి. వ్యవసాయ బిల్లుల అంశంపై ఎన్డీయే నుంచి శిరోమణి అకాలీ దళ్ పార్టీ వైదొలిగింది. బిల్లులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని మోదీ ఇటీవల పలుమార్లు తిప్పికొట్టారు.

రైతులు ఇప్పుడు మాత్రం దేశంలో తమకు ఇష్టమొచ్చిన చోట వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడం లేదా? ప్రత్యేకించి కొత్త బిల్లులతోటే రైతులకు ఈ వెసులుబాటు కలుగుతోందని చెప్పడం తప్పుదారి పట్టించడమేనని కాంగ్రెస్ చెబుతోంది. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ ఉండదని అంటోంది. కార్పొరేట్ గుత్తాధిపత్యానికి తెరలేపి, రైతు నడ్డివిరిచారంటూ మండిపడుతోంది.

ఈ క్రమంలో అందరి దృష్టి రాష్ట్రపతి నిర్ణయం మీదే పడింది. అయితే, అంతిమంగా పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లులకు ఆమోదముద్ర వేయడానికే రాష్ట్రపతి మొగ్గుచూపారు.