Begin typing your search above and press return to search.

పెద్దోళ్లలో భక్తి రసం పొంగిపొర్లుతుందేమి..?

By:  Tupaki Desk   |   7 Jan 2016 6:42 AM GMT
పెద్దోళ్లలో భక్తి రసం పొంగిపొర్లుతుందేమి..?
X
కరుణానిధి.. రామోజీరావు.. వీరిద్దరూ ఒకే వరసులో ఉండే విషయం ఏదైనా ఉందా? అంటే.. లేదనే చెబుతారు. కానీ.. నాస్తికులుగా వీరి ట్రాక్ రికార్డు చూస్తే.. వీరిద్దరూ ఒకే జాబితాలో కనిపిస్తారు. ఆసక్తికరంగా ఈ ఇద్దరు నాస్తికులు ఇప్పుడు విపరీతమైన భక్తిసాగరంలో మునిగితేలుతున్నారు. తెలుగువారికి సుపరిచితమైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు విషయానికి వస్తే.. ఆయన తన దినపత్రికలో రాశిఫలాలు ముద్రించటానికి సైతం ఒప్పుకోలేదు. దాదాపు పాతికేళ్లకు పైనే ఆయన గ్రహబలం లాంటివి తన పత్రికలో కనిపించకుండా అడ్డుకున్నారు.

ఆ తర్వాత ఆయన ఓకే చెప్పక తప్పలేదు. చివరకు తన కొడుకు పెళ్లి సమయంలోనూ పూజలు పునస్కారాల పట్ల పెద్ద మక్కువ చూపలేదని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి రామోజీ.. ఈ రోజున ‘‘ఓంసిటీ’’ పేరిట భారీ అధ్యాత్మిక ప్రాజెక్టు మీద బిజిబిజీగా ఉన్నారు. దేశంలోని 108 సుప్రసిద్ధం ఆలయాల నమూనాలతో నిర్మించే ఓంసిటీలో.. ఆయా దేవాలయాల్లో నిత్యం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో.. సరిగ్గా అలాంటి కార్యక్రమాల్నే ఓంసిటీలో నిర్వహించనున్నట్లు చెబుతారు. ఒకప్పుడు దేవుడంటే గిట్టని రామోజీ.. ఇప్పుడు అదే దేవుడి పేరుతో భారీగా సిటీ కట్టించనుండటం కాలమహిమ కాక మరేంటి?

ఇక.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత కరుణానిధి ఎంతటి నాస్తికుడో ప్రపంచానికి తెలిసిందే. ఆస్తికుల మనసు గాయపడేలా ఆయన దేవుళ్లను ఉద్దేశించి చాలానే వ్యాఖ్యలు చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు మారిపోయారు. ఆయనలోని మార్పు చూసిన వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి. దేవుడన్న మాటను ఉచ్ఛరించటానికి సైతం ఇష్టపడని కరుణానిధి.. ఇప్పుడు అధ్యాత్మిక సీరియల్ కు మనసుకు హత్తుకునేలా మాటలు రాయటం గమనార్హం.

భారతీయులకు విశిష్టాద్వైతాన్ని పరిచయం చేసిన రామానుజాచార్య జీవితకథతో వస్తున్న సీరియల్ కు ఆయన మాటలు రాస్తున్నారు. తమ కుటుంబానికి చెందిన కలైంజర్ టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. దీని తెలుగు వెర్షన్ ను శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారం చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా.. ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు నాస్తికతను వదిలేసి.. భక్తిసాగరంలో మునిగితేలటం దేనికి సంకేతం..? ఈ పరిణామ క్రమాన్ని ఏమనాలి?