Begin typing your search above and press return to search.

మీడియా మొఘల్ అందరిలో ఒకరయ్యారు

By:  Tupaki Desk   |   11 Sep 2015 5:04 AM GMT
మీడియా మొఘల్ అందరిలో ఒకరయ్యారు
X
తన పేరును ఒక బ్రాండ్ కంటే కూడా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిపిన వ్యక్తి రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు. ఈనాడుతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన ఆయన విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నారు. రామోజీని చాలామంది విమర్శిస్తారు కానీ.. ఆయనలోని కొన్ని గుణాలు ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.

చిట్ ఫండ్ లాంటి వ్యాపారం చేస్తూ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో ముఖాముఖిన ఢీ కొట్టిన సందర్భంలో ఆయన్ను తెలుగు ప్రజలు ఎంతగా నమ్ముతారన్న విషయం అందరికి అర్థమైంది. మార్గదర్శి ఇష్యూలో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలు కలకలం రేపినా.. ఒక్కరంటే ఒక్కరు కూడా మార్గదర్శికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయని పరిస్థితి.

ఏదైనా సంస్థ పరిస్థితి బాగోలేంటూ వేలాది మంది తమ డబ్బు కోసం క్యూ కడతారు. అలాంటిది కోట్లాది మంది సభ్యులుగా ఉన్న మార్గదర్శి విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో తలపడిన సందర్భంలో పవర్ ఎంతగా ప్రయోగించినా.. ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవటం.. ఎవరూ మార్గదర్శిలో తాము దాచుకున్న డబ్బు కావాలని డిమాండ్ చేయటం.. ఇబ్బంది పడటం లాంటివి లేకపోవటంతో చూసి ఆయన ప్రత్యర్థులు సైతం ముక్కన వేలేసుకున్నారు.

ఇలాంటి విలక్షణమైన రామోజీలో మరో గుణం ఉంది. ఆయన నలుగురిలో ఒకరిగా అస్సలు కనిపించరు. ఆయన ఒక్కరే కొట్టొచ్చినట్లు కనిపిస్తారు. ఆయన రేంజ్ ఏమిటన్నది మోడీ సర్కారు కొలువు తీరే సందర్భంలో దేశానికి తెలిసి వచ్చింది. ప్రధానమంత్రి మోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో అంబానీ లాంటి పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెనుక వరుసలో కూర్చుంటే రామోజీ మాత్రం మొదటి వరుసలో కూర్చునే అరుదైన గౌరవం లభించింది.

మోడీ సర్కారు కలల ప్రాజెక్టు అయిన స్వచ్ఛభారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన రామోజీ.. తాజాగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పది మందిలో ఒకరిగా ఉండే రామోజీరావు.. అందరిలో ఒకరైనట్లుగా కనిపించటం గమనార్హం. ఏది ఏమైనా తాజాగా మీడియా సంస్థలు ప్రచురించిన ఫోటోలో అందరిలో ఒకడిగా కనిపించిన రామోజీ కాస్తంత కొత్తగా కనిపిస్తారనటం ఖాయం.