Begin typing your search above and press return to search.

రామోజీకి.. కేసీఆర్ కు దూరం అంత పెరిగిందా?

By:  Tupaki Desk   |   22 March 2019 5:23 AM GMT
రామోజీకి.. కేసీఆర్ కు దూరం అంత పెరిగిందా?
X
మీడియా మొఘ‌ల్.. రామోజీ గ్రూపు ఛైర్మ‌న్ చెరుకూరి రామోజీరావు ఏం చేసినా అదిరిపోయేలా ఉంటుంద‌ని చెబుతారు. తాను చేసే ప్రాజెక్టులు భారీగా ఉండేలా ఆయ‌న జాగ్ర‌త్త తీసుకుంటారు. టాక్ ఆఫ్ ద టౌన్ అన్న‌ట్లుగా ఆయ‌న విజ‌న్ ఉంటుంద‌ని చెబుతారు. రామోజీ ఫిలింసిటీ.. ఈటీవీ ఛాన‌ళ్ల త‌ర్వాత ఆయ‌న స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తూ.. ప్ర‌తి అంశాన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తూ.. ఏళ్ల త‌ర‌బ‌డి తెర వెనుక చేసిన ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌తిరూపంగా తాజాగా మార్కెట్ లోకి తీసుకొచ్చిన ఈటీవీ భార‌త్ యాప్ ను చెబుతారు.

13 భాష‌ల్లో తీసుకొచ్చిన ఈ న్యూస్ యాప్ దేశంలోనే అతి పెద్ద‌దిగా చెబుతారు. ఇందుకోసం వంద‌లాది కోట్ల‌ను రామోజీ ఖ‌ర్చు చేశార‌ని చెబుతారు. ఒక న్యూస్ యాప్ కోసం వంద‌లాది మందిని రిక్రూట్ చేసుకోవ‌టం ఈ మ‌ధ్య కాలంలో జ‌ర‌గ‌లేద‌ని.. అది ఒక్క ఈనాడు భార‌త్ యాప్ కోస‌మే జ‌రిగింద‌న్న మాట మార్కెట్ వ‌ర్గాలు చెబుతుంటారు.

త‌న మ‌న‌మ‌రాలు ప‌ర్య‌వేక్షించే యాప్ ను తమ స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో రూపొందించేందుకు రామోజీ చాలానే క‌ష్ట‌ప‌డిన‌ట్లు చెప్పినా.. యాప్ చూసిన‌ప్పుడు అలాంటి కొత్త ఫీల్ పెద్ద‌గా క‌నిపించ‌లేద‌న్న మాట మీడియా రంగానికి చెందిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏం చేసినా త‌న రేంజ్ ఎంత‌న్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చేస్తుంటారు.

తాజాగా రిలీజ్ చేసిన ఈటీవీ భార‌త్ యాప్ కోసం ఆయ‌న హ‌డావుడి భారీగా ఉంద‌ని చెప్పాలి. న్యూస్ యాప్ ను త‌న‌కు అత్యంత సన్నిహితుడు.. మిత్రుడైన ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడి చేత ఓపెన్ చేయించ‌గా.. 13 భాష‌ల‌కు సంబంధించి ఒక్కో భాష‌ను ఒక్కొక్క‌రి చేత ఓపెన్ చేయించ‌టం విశేషం.

ఇందులో భాగంగా ఒక్కో రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రి లేదంటే.. గ‌వ‌ర్నర్ ల‌తో యాప్ ను ప్రారంభించ‌టం క‌నిపించింది.

తెలుగుకు సంబంధించి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేత లాంఛ్ చేయిస్తే.. తెలంగాణకు మాత్రం రామోజీనే స్టార్ట్ చేయ‌టం గ‌మ‌నార్హం. ఈటీవీ భార‌త్ యాప్ ను రిలీజ్ చేసిన ప్ర‌ముఖుల్లో మ‌హారాష్ట్ర.. అసోం.. చ‌త్తీస్ గ‌ఢ్.. ఢిల్లీ.. గుజ‌రాత్.. హ‌ర్యానా..హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. జార్ఖండ్‌.. క‌ర్ణాట‌క‌.. కేర‌ళ‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రులు ప్రారంభిస్తే.. బిహార్.. ప‌శ్చిమ‌బెంగాల్.. ఒడిశాల‌లో మాత్రం ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్లు ప్రారంభించారు. ఉర్దూ విభాగాన్ని ప్ర‌ముఖ క‌వి ర‌చ‌యిత గుల్జార్ స్టార్ట్ చేస్తే త‌మిళ యాప్ ను ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ప్రారంభించారు. ఇక‌.. పంజాబ్ విభాగాన్ని మాజీ అథ్లెట్ మిల్కాసింగ్ స్టార్ట్ చేశారు. ఇంత భారీగా.. ఇంత మంది ప్ర‌ముఖులు ప్రారంభిస్తే.. ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరు లేక‌పోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి రామోజీ వ‌ర్సెస్ కేసీఆర్ మ‌ధ్యన స‌మ్ థింగ్.. స‌మ్ థింగ్ చోటు చేసుకుంద‌ని.. వారి మ‌ధ్య ట‌ర్మ్స్ బాగా లేద‌న్న మాట వినిపిస్తున్నా.. అందులో నిజం లేద‌ని ప‌లువురు కొట్టిపారేస్తున్నారు. తాజా ప‌రిణామం మాత్రం క‌చ్ఛితంగా అండ‌ర్ లైన్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఇంత మంది ప్ర‌ముఖుల‌తో గ్రాండ్ గా ఓపెన్ అయిన యాప్ లో కేసీఆర్ లేక‌పోవ‌టం ఏమిటి మ‌ర్మం? దీనికి స‌మాధానం చెప్పేదెవ‌రు?