Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణ‌యం సూప‌రంటున్న రామోజీ

By:  Tupaki Desk   |   22 Sep 2017 9:05 AM GMT
కేసీఆర్ నిర్ణ‌యం సూప‌రంటున్న రామోజీ
X
మీడియా మొఘ‌ల్ రామోజీ ఎవరినైనా మెచ్చుకోవ‌డం మీకు తెలుసా? అందులోనూ పబ్లిక్‌ గా....పైగా ప్రత్యేక లేఖ రాసి!ఎంటి సందేహం...ఇది జ‌రిగే ప‌నేనా? అనుకుంటున్నారా? అంత‌లా ఆశ్చ‌ర్య‌పోయేదే జ‌రిగింది. ఆ ప్ర‌త్యేక గుర్తింపును పొందింది ఎవ‌రో తెలుసా? తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇంత‌కీ ఎందుకు అంటారా? ప‌్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించ‌డం. ఈ క్ర‌మంలో ఆయ‌న తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు రామోజీని ఈ స్థాయిలో మైమ‌రచిపోయేలా చేశాయి.

గ‌త‌వారం ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ తెలుగు భాషా పరిరక్షణకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని తేల్చిచెప్పారు. అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ - ప్రైవేటు సంస్థల బోర్డులను ఖచ్చితంగా తెలుగులోనే రాయాలని ఆదేశించారు. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే నిమిత్తం సీఎం రెండు కీలక నిర్ణయాలను ప్రకటించారు. తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో ఇకపై అనుమతి లభించనుంది. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్థూ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండొచ్చు. ప్రాథమిక - మాధ్యమిక - ఉన్నత - ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సిలబస్ రూపొందించి వెంటనే పుస్తకాలు ముద్రించాలని తెలిపారు. సాహిత్య అకాడమీ రూపొందించిన ఈ సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలన్నారు. ఇకపై ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా - ఖచ్చితంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌ను ఇప్ప‌టికే ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు అభినందించారు. తాజాగా ఆ జాబితాలో రామోజీరావు చేరారు. తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపిన మీడియా మొఘ‌ల్ ఈ స‌భ‌లు విజ‌యవంతం కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఆకాంక్షించారు. తెలుగు భాష‌ను ప‌టిష్ట‌వంతం చేసేందుకు ఈ నిర్ణ‌యాలు ఉప‌యుక్త‌మ‌ని ప్ర‌శంసించారు. దీంతోపాటుగా ప‌లు సూచ‌న‌లు సూచ‌న‌లు సైతం చేశారు. 12వ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు ఇవ్వ‌డం మ‌హ‌త్త‌ర‌మైన‌ద‌ని తెలిపారు. ఇదే రీతిలో పోటీ ప‌రీక్ష‌ల్లోనూ తెలుగును త‌ప్ప‌నిస‌రి భాష‌గా చేయాల‌ని కోరారు. తెలుగుభాష మ‌రింత‌గా వాడుక‌లోకి వ‌చ్చేందుకు ప‌రిపాల‌న‌లో సైతం భాష‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని లేఖ‌లో రామోజీరావు ఆకాంక్షించారు.