Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలో మీడియో మొఘల్

By:  Tupaki Desk   |   5 Jan 2017 4:55 AM GMT
ఆసుపత్రిలో మీడియో మొఘల్
X
మీడియా మొఘల్.. ప్రతి తెలుగోడికి సుపరిచితుడైన ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరల్ ఫీవర్.. వెన్నునొప్పి.. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధ పడుతున్నట్లుగా చెబుతున్నారు. గడిచిన నాలుగు రోజులుగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం నుంచి ఆయన కాసింత అనారోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. సోమవారం నాటికి జ్వరం తీవ్రత పెరగటంతో ఆయన్ను యశోద ఆసుపత్రిలో చేర్చినట్లుగా తెలుస్తోంది.

సీనియర్ ఫిజీషియన్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా.. ఆయనకు వైద్యం చేసే వైద్యుడిగా సుపరిచితుడైన డాక్టర్ ఎన్వీ రావు.. పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత సాగర్ రెడ్డిల నేతృత్వంలోని టీం.. రామోజీకి చికిత్స చేస్తున్నట్లు చెబుతున్నారు. అనారోగ్యం అన్న మాట రామోజీకి సంబంధించి పెద్ద విననట్లుగా చెబుతుంటారు. ఎంత పనిలో ఉన్నప్పటికీ.. క్రమబద్ధమైన దినచర్య కారణంగా ఆయనెప్పుడూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారని చెబుతుంటారు.

రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేస్తారని.. రాత్రి తొమ్మిది గంటల్లోపే నిద్ర పోతారని.. ఆహార అలవాట్ల విషయంలో ఆయన చాలా చాలా జాగ్రత్తగా ఉంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. అలాంటి రామోజీ అస్వస్థతకు గురి కావటం చాలా తక్కువని చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. బుధవారం స్వల్పంగా ఆహారం తీసుకున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన వెంటనే కోలుకొని ఎప్పటిలానే ఉత్సాహంగా రోజువారీ విధుల్ని నిర్వహించాలని కోరుకుందాం. స్పీడీ రికవరీ.. రామోజీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/