Begin typing your search above and press return to search.

మార్గదర్శి కేసులో ఏపీ సర్కార్ ఇంప్లీడ్ : రామోజీ వర్సెస్ జగన్....?

By:  Tupaki Desk   |   22 Aug 2022 3:32 PM GMT
మార్గదర్శి కేసులో  ఏపీ సర్కార్ ఇంప్లీడ్ : రామోజీ  వర్సెస్ జగన్....?
X
మీడియా దిగ్గజం రామోజీరావుకు ఆదివారం ఒక పండుగలా గడచింది. ఆయన ఇంటికి దేశాన్ని ఏలే నంబర్ టూ, అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ముద్రపడిన అమిత్ షా వచ్చారు. ఇద్దరూ కలసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఏనాడూ ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలవని రామోజీరావు దగ్గరకు ఆ పెద్దలే వచ్చి కలుస్తారు అన్నది వాస్తవం. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు.

అలా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలోనూ ఒక మీడియా మొగల్ తో అమిత్ షా భేటీ చాలా చర్చనీయాంశం అయింది. దటీజ్ రామోజీరావు అని అస్మదీయులు అంతా మురిసిపోయిన వేళ జస్ట్ కొద్ది గంటల ముందు ఆ నెక్స్ట్ డేనే మరో న్యూస్. అదేమిటీ అంటే రామోజీరావు సంస్థగా చెప్పబడుతున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన ఒక కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది.

అంటే వైసీపీ సర్కార్ ఇక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి మా వాదనలు కూడా వినాలని, తమ పిటిషన్ని కూడా ఉండవల్లి పిటిషన్ తో కలిపి విచారించాలని కోర్టుని కోరడంతో ఈ కేసు సెప్టెంబర్ 19కి సుప్రీం కోర్టు బెంచ్ వాయిదా వేసింది. నిజానికి ఈ రోజున కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉండకపోతే ఏం జరిగేదో కానీ లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చినట్లుగా ఏపీ సర్కార్ రంగ ప్రవేశం చేసింది.

దాంతో ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సర్కార్ భేషైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు. అందుకు గానూ తాను థాంక్స్ చెబుతున్నానని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ కేసు ఏమిటీ దాని కధా కమామీషూ ఏంటి అంటే ఈ కేసు 2006 నాటిది. ఆ ఏడాది నవంబర్లో దాఖలు అయింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు కలెక్ట్ చేస్తోందని చెప్పి కేసు ఫైల్ చేసామని ఉండవల్లి చెప్పారు. దాని మీద మార్గదర్శి సంస్థ తరఫున తన మీద యాభై లక్షలకు పరువు నష్టం దావా కూడా వేశారని అన్నారు. మార్గదర్శితో రామోజీరావుకు ఏమిటి సంబంధం అని అన్న వారే మరో అఫిడవిట్ లో రామోజీరావుకు ఉన్న అనేక సంస్థలలో మార్గదర్శిని కూడా చేర్చి చూపించారని గుర్తు చేశారు.

ఇవన్నీ కూడా కోర్టును తప్పు తోవ పట్టించడమే అని అన్నారు. ఇక్కడ రామోజీరావు అయినంతమాత్రాన నిబంధనలు ఉండవా అన్నదే తన ప్రశ్న అని అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు 45 ఎస్ అన్న నిబంధనలను ఉల్లంఘించారు అని నాటి వైఎస్సార్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీలో క్రిష్ణం రాజు అనే పోలీస్ ఆఫీసర్ ద్వారా దర్యాప్త్ చేయించి కేసు పెట్టించిందని అని ఉండవల్లి చెప్పారు.

అసలు అలాంటి ఉల్లంఘన ఏదీ జరగలేదు. నేను హెచ్ యూ ఎఫ్ గా వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నాకిది వర్తించదు అన్నది రామోజీరావు వాదనగా ఉంది. ఈ చట్టం చేసిన రిజర్వ్ బ్యాంక్ అయితే హెచ్ యూ ఎఫ్ లు చేయకూడదనే చెబుతోంది అని ఉండవల్లి అంటున్నారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ అయితే 2005లోనే రామోజీరావుని దీని మీద అడిగిందని, హెచ్ యూ ఎఫ్ కింద వ్యాపారం చేయవద్దు అని రిజర్వ్ బ్యాంక్ పేర్కొందని, దాని మీద రామోజీరావు అయితే తాను ఇక మీదట చేయనని 2005లోనే రిజర్వ్ బ్యాంక్ కు లేఖ రాశారని కూడా ఉండవల్లి పేర్కొన్నారు.

అయినా సరే ఆ తరువాత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఈ వ్యాపారం చేసింది కాబట్టి 45 ఎస్ నిబంధలకు ఉల్లంఘణ కింద రాష్ట్ర ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ నాడే సూచించింది అని ఉండవల్లి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు. ఈ కేసులో పదహారు ఏళ్ళుగా ఎన్నో స్టేలు తెచ్చారని, ఎన్నో రకాలుగా కాలయాపన జరిగిందని ఉండవల్లి చెప్పారు.

మొత్తానికి ఈ కేసు విషయంలో ఉమ్మడి హై కోర్టు విడిపోయినపుడు కేసు కెట్టేసారు అని అన్నారు. అయితే నాడు విడిపోయిన ఏపీ సర్కార్ కి ఏ మాత్రం తెలియచేయకుండా ఈ కేసు కొట్టేశారని ఉండవల్లి అన్నారు. ఆ విషయం తనకు ఏడాది తరువాత తెలిసిందని, తాను స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీం కోర్టులో కేసు వేశాను అని అయితే తనకు ఈ కేసులో ఏమిటి సంబంధం అని ఈ కేసు కొట్టి వేసే దశలో ఏపీ సర్కార్ చివరి నిముషంలో ఏపీ సర్కార్ ఇంప్లీడ్ అవడం వల్ల కచ్చితంగా ఈ కేసులో న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని ఉండవల్లి వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఆదివారమే ఏపీ సర్కార్ ఎస్ ఎల్ పీ వేయడం బిగ్ ట్విస్ట్. అదే రోజు రామోజీరావు దగ్గరకు అమిత్ షా రావడం జరిగింది. మొత్తానికి ఏపీ సర్కార్ మూడేళ్ళుగా ఉండవల్లి కోరుతున్నా వేయని ఎస్ ఎల్ పీ ఇపుడు సరిగ్గా అదే ఆదివారమే వేసింది అంటే కచ్చితంగా రామోజీరావు విషయంలో గట్టిగా ఉండాలని నిర్ణ‌యించుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే టైమ్ లో వైఎస్సార్ పెట్టిన కేసు ఇది. జగన్ కూడా పంతంగా తీసుకున్నారా అన్న చర్చ నడుస్తోంది.

అందుకే ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నే ప్రభుత్వం తరఫున గట్టి న్యాయవాదిగా నియమించడం అంటే కచ్చితంగా ఈ కేసులో జగన్ సర్కార్ తేల్చుకోవాలని కనిపిస్తోంది అంటున్నారు. ఈ కేసు కనుక ముందుకు వెళ్తే కచ్చితంగా రామోజీరావుకు ఇబ్బందులు తప్పవని ఉండవల్లి అంటున్నారు. మరి నాడు వైఎస్సార్ మాదిరిగా జగన్ సహకరిస్తే ఉండవల్లి గట్టిగానే ఈ కేసులో నిలబడతారు. టోటల్ గా చూస్తే ఈ కేసు కాదు కానీ రామోజీ వర్సెస్ జగన్ గా సీన్ మారుతుందా అన్న చర్చ ఉంది మరి.