Begin typing your search above and press return to search.

రమ్య తాత ఎంత నరకం అనుభవించారంటే..

By:  Tupaki Desk   |   18 July 2016 4:54 AM GMT
రమ్య తాత ఎంత నరకం అనుభవించారంటే..
X
ఆరుగురు కుర్రాళ్లు ఆకతాయితనంతో.. వెనుకాముందు చూసుకోకుండా.. పూటుగా తాగేసి.. కారును వేగంగా నడిపేసిన వైనం ఒక కుటుంబానికి ఎంత శాఫంగా మారిందన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారందరికి ఇప్పుడు సుపరిచితం. తాగిన మైకంలో కారును వేగంగా పోనివ్వటం ఒక తప్పు అయితే.. దాన్ని కంట్రోల్ చేయలేక.. డివైడర్ ను ఢీ కొని ఎగిరి పడి.. రోడ్డు అవతల వెళుతున్న కారు మీద అదాటుగా పడటం.. కింద కారు నుజ్జు నుజ్జు కావటంతో పాటు అందులో ప్రయాణిస్తున్న కుటుంబం తీవ్ర గాయాలపాలు కావటం తెలిసిందే.

చిన్నారి రమ్య స్కూల్లో చేరిన మొదటి రోజు నేపథ్యంలో ఆమెను స్వయంగా వెంటబెట్టుకొచ్చేందుకు స్కూల్ కి వచ్చిన ఆమె బాబాయ్.. తల్లి.. తాత అంతా స్కూల్ నుంచి తిరిగి వచ్చేక్రమంలో ఈ దారుణ ప్రమాదం జరగటం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే రమ్య బాబాయ్ ఘటనాస్థలంలోనే మరణించటం ఒక విషాదం అయితే.. దాదాపు ఏడెనిమిది రోజుల పాటు మరణంతో పోరాటం చేసిన చిన్నారి రమ్య చావు చేతిలో దారుణంగా ఓడిపోయి శాశ్వితంగా వీడిపోయింది. ఈ రెండు విషాదాలతో రమ్య కుటుంబం ఎవరూ తీర్చలేని శోకంలో మునిగిపోయింది.

ఇది చాలదన్నట్లుగా రమ్య తల్లికి తీవ్రంగా గాయాలుకావటంతో ఆమె పైకి నడవలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదంలో గాయపడిన రమ్య తాతా మధుసూదనాచారి తాజాగా మరణించటం తెలిసిందే. ప్రమాదం జరిగిన 18 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆయన నరకయాతన అనుభవవించినట విషయాన్ని రమ్య మేనత్త చెప్పుకొచ్చారు. ఆసుపత్రిలో తన తండ్రి 18 రోజులు నరకయాతన పొందారని.. ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దని వాపోయారు.

తమతో మాట్లాడాలని ఆయన ఎంతో ప్రయత్నం చేశారని.. కానీ మాట్లాడలేకపోయారని.. చేత్తో రాద్దామని అనుకున్నా.. ఆయన చేతులు విరిగిపోవటంతో రాయలేకపోయినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. ప్రమాదం జరిగిన రోజున తన తండ్రిని నిమ్స్ లో చేర్చుకోవటం ఆలస్యమైందని.. డాక్టర్ల నిర్లక్ష్యం ఉందన్న ఆమె.. ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి మరీ వైద్యం చేయించినట్లుగా చెప్పారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి బదులుగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ తన తండ్రి బాడీని ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లమని రమ్య తండ్రి వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన ఆరుగురు విద్యార్థుల్ని కఠినంగా శిక్షించాలంటూ రమ్య కుటుంబం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తోంది. పెద్ద మయసులో తీవ్ర గాయాలై.. చేతులు కూడా కదపలేని స్థితిలో 18 రోజులపాటు పడిన కష్టం తలుచుకుంటేనే వణికిపోవటం ఖాయం.