Begin typing your search above and press return to search.

భారత్ లో మృత్యుఘోష ..పాక్ ను మెడల్ కోరిన 26/11 సూత్రధారి !

By:  Tupaki Desk   |   1 Dec 2020 2:30 PM GMT
భారత్ లో మృత్యుఘోష ..పాక్ ను మెడల్ కోరిన 26/11 సూత్రధారి !
X
ముంబై 26/11 బాంబు పేలుళ్లు జరిగి 12 ఏళ్లు గడుస్తోంది. పాకిస్తాన్‌ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు చెందిన 10 మంది ముష్కరులు సముద్ర మార్గం ద్వారా భారత్‌ లోకి ప్రవేశించారు. సాయుధులైన ఆ 10 మంది ముంబాయిలో 12 చోట్ల దాడులు జరిపారు. ఆనాటి దాడుల్లో 166 మంది చనిపోగా..300 మందికిపైగా గాయపడ్డారు. నవంబర్ 26, 2008న ప్రారంభమైన.. ఈ దాడులు మూడు రోజుల పాటు ముంబాయి వాసులను కంటి మీద కునుకు లేకుండా చేసి నవంబర్ 29, 2008న ముగిశాయి. ఈ దాడుల్లో కీలక పాత్ర వహించిన ఉగ్రవాది కసబ్. మూడు రోజుల కాల్పుల తర్వాత అతన్ని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది. ఆ తర్వాత కోర్టుల చుట్టు తిప్పీ.. తిప్పీ.. చివరికి నవంబర్ 21, 2012న పూణేలో యరవాడ జైలులో ఉరి తీశారు.

ఇకపోతే , ఈ 26/11 దాడుల్లో కీలక సూత్రధారుల్లో ఒకరైన పాక్ సంతతికి చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రానా ప్రస్తుతం అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిపై దాఖలు చేసిన ఛార్జ్‌ షీట్‌ లో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్ లో మారణ హోమానికి పాల్పడినందుకు తనకు అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. అంతేకాదు, ఇందులో పాల్గొన్న తొమ్మిది మంది ఉగ్రవాదులకు అత్యున్నత సైనిక పురస్కారాలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భారత్ ఇచ్చిన ఆధారాలతో తహపూర్ రానాను లాస్ ఏంజెల్స్ పోలీసులు జూన్ 10న అరెస్ట్ చేశారు. ఇటీవల కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్ ‌లోని వివరాలను అటార్నీ నికోలా టీ హన్నా వివరించారు. దీనితో భారత్ అతన్ని అప్పగించాలని కోరింది.

ఉగ్రదాడి తర్వాత కూడా హెడ్లీ, రానా మధ్య సంప్రదింపులు జరిగాయి. దాడి జరిగిన ప్రదేశాల్ని వీడియో తీయడం, డిసెంబరులో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని రానాకు హెడ్లీ వివరించాడు.. ఇరువురి మధ్య ఇలా పలుసార్లు సంభాషణలు కొనసాగాయి. ఈ క్రమంలో వీరి సంభాషణల్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ ‌బీఐ ఛేదించింది. దాడుల్లో హతమైన 9 మంది ఉగ్రవాదులకు పాకిస్థాన్ అత్యున్నత సైనిక పురస్కారం, తనకు దేశ అత్యున్న పౌర పురస్కారాల్లో ఒకటి ఇవ్వాలని రానా డిమాండ్‌ చేసిన విషయాన్ని ఎఫ్ ‌బీఐ స్పష్టంగా వింది. ఈ విషయం గురించి పాక్‌లోని తమ సభ్యులకు తెలియజేసినట్లు హెడ్లే చెప్పడంతో రానా చాలా సంతోషించాడు అని హన్నా తెలిపారు.పాల వ్యాపారం నెపంతో సెప్టెంబరు 2006లో భారత్ ‌లోకి అడుగుపెట్టిన హెడ్లీ.. పలుసార్లు తన వీసాను పొడిగించుకున్నాడు. తాజ్‌ హోటల్‌ సహా పలు ప్రాంతాల్ని స్పష్టంగా వీడియో తీసి, వాటిని పాక్‌ ఉగ్రవాదులకు అందజేశాడు. వారి సూచనలతో 2007 ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చి మరోసారి ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా వేశాడు. ఈ మేరకు పూర్తి వివరాలను ఛార్జిషీట్‌ లో హన్నా పొందుపరిచారు.