Begin typing your search above and press return to search.

సుశీల్ ను ఉరి తీయాలని రాణా తల్లిదండ్రుల డిమాండ్‌ !

By:  Tupaki Desk   |   24 May 2021 2:30 PM GMT
సుశీల్ ను ఉరి తీయాలని రాణా తల్లిదండ్రుల డిమాండ్‌ !
X
అంతర్జాతీయ స్థాయి రెజ్లర్ , ఒలంపిక్స్‌ లో రెండు పతకాలు సాధించిన సుశీల్ కుమార్ హత్య కేసులో ఇరుక్కోవడం అనేది క్రీడా వర్గాల్లో గత కొన్ని రోజుల నుండి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన వ్యక్తి సైతం రెజ్లర్, అలాగే జూనియర్ స్థాయిలో జాతీయ ఛాంపియన్ సాగర్ రాణా కావడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సాగర్‌ రాణా మృతికి కారణమైన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమారుడి మృతికి కారణమైన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను ఉరితీయాలని సాగర్‌ రాణా తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసును న్యాయంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అతడు తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తాడని ఆరోపించారు. అతడి వద్ద నుంచి పతకాలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

నా కొడుకును చంపిన వ్యక్తి ఒక మెంటర్‌ గా ఉండడానికి అర్హుడు కాదు. అతనికి దక్కిన గౌరవాన్ని, పతకాల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. క్రిమినల్స్‌ తో లింకులు ఉన్నాయి. రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి, కోర్టు ఎంక్వయిరీ జరిపిస్తే, దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉండవు అని సాగర్‌ పేరెంట్స్‌ కోరుతున్నారు. న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. పారిపోయినప్పుడు సుశీల్‌ ఎక్కడున్నాడు? అతడికి ఎవరు ఆశ్రయమిచ్చారు, గ్యాంగ్‌ స్టర్లతో అతడికున్న సంబంధాలపై దర్యాప్తు చేయాలి. అతడిని ఉరి తీయాలి. తన సొంత విద్యార్థులనే చంపేవారికి అదో పాఠం కావాలి రాణా తండ్రి అన్నారు. ఇరవై మూడేళ్ల ట్రైనీ రెజ్లర్‌ సాగర్‌ రాణా ను అనుచరుల సాయంతో చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుశీల్‌ పై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ కావడంతో పాటు ఆచూకీ చెప్పినవాళ్లకు లక్ష రూపాయల ప్రైజ్‌ మనీ కూడా ప్రకటించారు. చివరికి పంతొమ్మిది రోజుల తర్వాత ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌, సుశీల్‌ తో పాటు అజయ్‌ అనే సహ నిందితుడ్ని ఆదివారం ఉదయం అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం కస్టడీ లో ఉన్నారు.