Begin typing your search above and press return to search.

నెలకు ఒక్కసారి సైకిల్ మీద ఆఫీసుకా?

By:  Tupaki Desk   |   3 Jan 2016 5:32 AM GMT
నెలకు ఒక్కసారి సైకిల్ మీద ఆఫీసుకా?
X
పర్యావరణ పరిరక్షణకు ఎవరికి వారు ఎంత వీలైతే.. అంతగా పని చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్య భూతం బారిన పడకుండా ఉండేందుకు వీలుగా ఎవరికి వారు.. తమకు తోచిన విధంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. అలా అని అసాధ్యమైన అంశాల్ని ప్రముఖులు ప్రస్తావించటం కూడా ధర్మం కాదు. ప్రాక్టికల్ గా వర్క్ వుట్ కాని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చే కన్నా.. ఆచరణ సాధ్యమైన అంశాలపై పిలుపునిస్తే బాగుంటుంది.

తాజాగా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు ఇచ్చిన పిలుపును చూద్దాం. అంతపెద్ద స్థాయిలో ఉన్న ఆయన సైకిల్ తొక్కుతూ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి ఎన్టీఆర్ నగర్ మార్కెట్ మీదుగా రంగారెడ్డిజిల్లా కోర్టుల వరకు వచ్చారు. ఆయనతో పాటు పలువురు అధికారులు సైకిళ్ల మీద వచ్చారు. అధికారిక కార్యక్రమం కావటంతో దీనికి తగిన ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల రెండో శుక్రవారం కోర్టు ఉద్యోగులు సైకిళ్ల మీద రావాలని కోరారు. ప్రస్తుతానికి నెలకు ఒకరోజు.. కొద్ది తర్వాత నెలకు రెండురోజుల చొప్పున సైకిళ్ల మీద రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. న్యాయమూర్తి చేసిన సూచన మంచిదే కానీ.. దీనికి సంబంధించి చాలానే సమస్యలు ఉన్నాయి. నగర జీవితంలో పని చేసే చోటుకు.. నివాసం ఉండే ఇంటికి మధ్య దూరం భారీగా ఉంటుంది. చాలామంది ఉద్యోగులు కనిష్టంగా 5 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే పరిస్థితి.

ఆరు కిలోమీటర్లు సైకిల్ తొక్కి.. (దగ్గరగా ఉండే కొద్ది మందిని మినహాయిస్తే) ఆఫీసుకు చేరుకోవటం ఒక సమస్య అయితే.. నగర ట్రాఫిక్ లో సైకిల్ తొక్కటం అంత సేఫ్ కాదన్న విషయం మర్చిపోకూడదు. ఇలాంటి వాటికి ముందే.. సైకిళ్ల నడిపేందుకు వీలుగా రహదారులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఎప్పుడో తొక్కిన సైకిళ్లను ఇప్పుడు నడపటం.. అదీ.. అడ్డదిడ్డంగా ఉండే నగర ట్రాఫిక్ లో అన్నది ప్రమాదకరం. ఆ విషయాన్ని గుర్తించి.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం స్వీయ రక్షణ విషయాన్ని విస్మరించటం ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.