Begin typing your search above and press return to search.

సీజేఐ బ‌ర‌స్ట్ అయ్యారు!

By:  Tupaki Desk   |   20 April 2019 12:26 PM GMT
సీజేఐ బ‌ర‌స్ట్ అయ్యారు!
X
20 ఏళ్లు నిజాయితీ ప‌ని చేసిన దానికి ఫ‌లితం ఇదా? 20 ఏళ్లుగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఉండి.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న మొత్తం రూ.6.80ల‌క్ష‌లు. దీని కంటే నా ద‌గ్గ‌ర ప‌ని చేసే చిన్న ఉద్యోగి ద‌గ్గ‌రే ఎక్కువ డ‌బ్బులు ఉంటాయి? రెండు ద‌శాబ్దాలు ప‌ని చేసిన త‌ర్వాత ఒక ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఇచ్చే బ‌హుమ‌తి ఇదేనా?.. ఇలా ఆవేద‌న‌కు గుర‌య్యారు సుప్రీంకోర్టు ప్ర‌ధాన‌న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్.

తాజాగా ఒక మ‌హిళ చీఫ్ జ‌స్టిస్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ.. ఆయ‌న త‌న‌పై లైంగిక వేధింపుల‌కు గురి చేసినట్లుగా ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు ఆయ‌న స్పందించారు. న్యాయ వ్య‌వ‌స్థ స్వేచ్ఛ ప్ర‌మాదంలో ప‌డింద‌ని..అదెప్ప‌టికి బ‌లిప‌శువు కాద‌న్న ఆయ‌న‌.. ఆరోప‌ణ‌లు న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌న్నారు.

త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల్ని ఖండించుకోవ‌టానికి తన‌ను తాను ఇంత త‌గ్గించుకోవాల్సి వ‌స్తుంద‌ని తాను అనుకోలేదంటూ విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ఈ వ్య‌వ‌హారం మొత్తం వెనుక పెద్ద శ‌క్తులే ఉన్నాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా సీజేఐ నోటి నుంచి విస్మ‌య‌క‌ర వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కార్యాల‌యాన్ని స్తంభింప‌చేయాల‌ని వారు చూస్తున్నారు.. రానున్న కొద్ది రోజుల్లో తాను కీల‌క కేసుల‌కు సంబంధించిన తీర్పులు ఇవ్వాల్సి ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.

సీజేఐపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ధ‌ర్మాస‌నంలో గొగోయ్ కూడా ఉన్నారు. ముగ్గురు స‌భ్యులున్న ఈ బెంచ్ లో గొగోయ్ తో పాటు జ‌స్టిస్ అరుణ్ మిశ్రా.. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నాలు ఉన్నారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై తాను ఎలాంటి తీర్పును వెలువ‌రించ‌న‌ని.. సీనియ‌ర్ న్యాయ‌మూర్తి అరుణ్ మిశ్రా తీర్పు చెబుతార‌న్నారు.

వ‌చ్చే వారం తాను ప‌లు కీల‌క కేసులు విచారించ‌నున్నాన‌ని.. అందుకే ఈ ర‌క‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ కొత్త అనుమాన‌పు బాంబును వ‌దిలారు. తాను త‌న స్థానంలో కూర్చుంటాన‌ని.. విధులు నిర్వ‌ర్తిస్తాన‌ని.. విష‌యాలు చాలా దూరం వెళ్లాయ‌ని.. అయిన‌ప్ప‌టికీ న్యాయ‌వ్య‌వస్థ ఎప్ప‌టికి బ‌లిప‌శువు కాదన్నారు. త‌న‌పై ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌టంతో.. ఏమీ దొర‌క్క చివ‌రికి ఇదొక‌టి ప‌ట్టుకొని వ‌చ్చారన్నారు. ఇంత‌కీ రానున్న వారంలో గొగోయ్ ముందుకు వ‌చ్చే ముఖ్య‌మైన కేసులేంటి? వాటి వివ‌రాలు బ‌య‌ట‌కు వస్తే సీజేఐ నోటి నుంచి మాట‌ల్లోని మ‌ర్మం కాస్త క్రాక్ అయ్యే వీలుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.