Begin typing your search above and press return to search.

ఈ కపుల్ కి.. బీజేపీకి లింకే లేదు

By:  Tupaki Desk   |   13 April 2019 6:03 AM GMT
ఈ కపుల్ కి.. బీజేపీకి లింకే లేదు
X
తెలివైనవారితో వచ్చే చిక్కేమిటంటే.. వారిని తట్టుకోవటం కష్టం. చాలామందికి తెలివైన వారితో స్నేహం కోసం.. వారితో మాట్లాడేందుకు మక్కువ చూపిస్తారు. కానీ.. అలాంటి వారితో రిలేషన్ కంటిన్యూ చేయటం అంత తేలికైన వ్యవహారం కాదన్న తత్త్వం కాస్త ఆలస్యంగా బోధ పడుతుంది. ఇంతకీ ఇప్పుడీ మాటను ఎందుకు చెప్పినట్లు? అన్న ప్రశ్న తలెత్తిందా?అక్కడికే వస్తున్నాం.

తెలివికి టెక్నాలజీ తోడైతే బాగానే ఉంటుంది. కానీ.. వారి ఆలోచనలు తేడాగా ఉంటేనే సమస్యంతా. ఇప్పుడు బీజేపీకి చెందిన బ్యాచ్ లో కొందరు టెక్నాలజీని అసరా చేసుకొని ఫేక్ న్యూస్ తోనూ.. ఫేక్ వార్తలతోనే వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు కొత్త తరహా చిక్కుల్ని ఇబ్బందుల్ని తెచ్చి పెడుతోంది.
ప్రముఖుల ఫోటోల్ని గుర్తు పట్టలేని రీతిలో మార్చేస్తున్న వైనం వారికి చిక్కుల్ని తెచ్చి పెడుతోంది. తాజాగా బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్.. దీపికా పదుకు జంట ఫోటోల్ని బీజేపీ నేతలు వాడేస్తున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోల్ని చూస్తుంటే.. ఆ విమర్శల్లో నిజం ఉందన్న భావన కలుగక మానదు.

వీరిద్దరి భుజాల మీద ఉన్న కాషాయ కండువా వీద.. బీజేపీకి ఓటు వేయండి.. మోడీని గెలిపించండి అన్న నినాదం.. కమలం మీట నొక్కి దేశ ప్రగతిలో భాగం కండి అంటూ మరో నినాదంతో ఉన్న కండువాను వేసుకున్న ఫోటోల్ని వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలు వస్తున్న సోషల్ మీడియా గ్రూపుల్ని చూస్తే.. మై బీ చౌకీదార్.. ఏక్ భారీ 100 కే భారి అన్న ఫేస్ బుక్ పేజీల్లో పోస్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. నిజంగానే రణవీర్.. దీపికలు బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారా? అంటే అది తప్పు. మరి.. వారి ఫోటోల మాటేమిటంటారా? గతేడాది నవంబరులో ముంబయిలోని సిద్ధి వినాయక టెంపుల్ కు వచ్చిన సందర్భంగా వారు కాషాయ కండువాలు వేసుకున్నారు.

వారు వేసుకున్న కాషాయ కండువాలు సాదాగా ఎలాంటి నినాదాలు లేకుండా ఉన్నాయి. వీటిపై ఎంచక్కా డిజిటల్ మార్ఫింగ్ చేసేసి వాడేస్తున్నారు. దీంతో.. నిజమైన ఫోటోను.. మార్ఫింగ్ ఫోటోను జత చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వైరి వర్గం వారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ప్రముఖుల ఫోటోల్ని మనసుకు తోచినట్లుగా వాడేయటం బాగోలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.