Begin typing your search above and press return to search.

ఈ రోజుల్లో పార్టీ మారడం సర్వసాధారణం..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 Dec 2019 12:28 PM GMT
ఈ రోజుల్లో పార్టీ మారడం సర్వసాధారణం..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీ మార్పు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓ ఎమ్మెల్యేగా తన భవిష్యత్తును తాను చేసుకోవాలి కదా అన్నారు. ‘ఈ రోజుల్లో పార్టీ మారడం సర్వసాధారణం. పార్టీ మారాలన్న ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు భవిష్యత్ చూసుకోవాలి కదా.

ఇక్కడుంటే భవిష్యత్ ఉందా? అసలు పవన్ కళ్యాణ్‌ కు సీఎం అవ్వాలన్న కోరిక లేదన్నారు. ఆయనకు ఆ కోరిక ఉంటేనే కదా మేం పార్టీలో ఉండేది. ఇదేమో భవిష్యత్ లేని పార్టీలాగానే ఉంది.’ అని రాపాక వరప్రసాదరావు చెప్పారు. తాను సీఎం అవ్వాలన్న ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తేనే అందరికీ మంచిదని రాపాక అన్నారు.

తనకు జనసేన పార్టీ షోకాజ్ ఇచ్చిందని, అందుకు తాను తీవ్రంగా స్పందించినట్టు వచ్చిన వార్తలన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాన్ కాకినాడ రైతు సౌభాగ్య దీక్షకు హాజరుకాలేనని ముందురోజే చెప్పానని రాపాక తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ ఇవ్వరని, అనుకూలంగా మాట్లాడితేనే మైక్ ఇస్తారన్నారు. అయినా, ప్రభుత్వం మంచి చేసినా కూడా చెడుగా చెప్పడం తన వల్ల కాదన్నారు.

జనసేన పార్టీలో బాధ్యత మొత్తం పవన్ కళ్యాణ్ మాత్రమే మోస్తున్నారని - ఇది సరికాదని రాపాక అభిప్రాయపడ్డారు. జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి - ఏదైనా సమస్య వస్తే స్థానికంగా ఉన్న నాయకత్వం రంగంలోకి దిగేలా సూచించాలన్నారు. బాధ్యతలు ఇస్తేనే వారికి కూడా బాధ్యతలు తెలుస్తాయన్నారు. నాదెండ్ల వల్లే పార్టీ నుంచి వెళ్లిపోతున్నామని పార్టీ నుంచి వెళ్లేవారు చెబుతున్నారని, తనకైతే నాదెండ్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పారు. అయితే, ఏదైనా ఉంటే పవన్ - నాదెండ్ల ఇద్దరే చర్చించుకుంటారని రాపాక అన్నారు.