Begin typing your search above and press return to search.

అత‌డు చేసింది కూడా ప‌వ‌న్ చేయ‌లేక‌పోయాడే?

By:  Tupaki Desk   |   15 July 2019 2:30 PM GMT
అత‌డు చేసింది కూడా ప‌వ‌న్ చేయ‌లేక‌పోయాడే?
X
ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న నేత‌గా రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ను చెప్పాలి. త‌న పార్టీ అధినేత రెండుస్థానాల్లో పోటీ చేసి ఓడిపోతే.. అందుకు భిన్నంగా జ‌న‌సేన త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు ఈ ఒకే ఒక్క‌డు. పార్టీ మార‌తార‌న్న‌ప్రచారం జ‌రిగినా.. తాను గెలిచిన పార్టీలోనే ఉంటాను త‌ప్పించి.. మారే ఆలోచ‌న లేద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌న‌సేన‌కు సంబంధించి ఆయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ మొత్తం ఓడిపోయి.. తాను ఒక్క‌డినే ఎందుకు గెలిచార‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న మాట‌లు విన్నంత‌నే అర్థ‌మైపోవ‌టం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ చాలాచోట్ల గెల‌వాల్సి ఉంద‌ని..కానీ ఓట‌మిపాలైనట్లు చెప్పారు.

త‌న గెలుపు వెనుక ర‌హ‌స్యాన్ని చెప్పిన ఆయ‌న‌.. పార్టీ ప‌రంగా గ్రామ‌స్థాయిలో క‌మిటీలు వేసుకోవ‌టంతోనే తాను విజ‌యం సాధించిన‌ట్లు చెప్పారు.మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ పార్టీకి చెందిన వారెవ‌రూ గ్రామ‌స్థాయి క‌మిటీలు వేసుకోలేద‌ని.. తాను మాత్రం అన్ని గ్రామాల త‌ర‌ఫున గ్రామ క‌మిటీలు వేసుకొని ప‌ని చేయ‌టంతో తాను విజ‌యం సాధించ‌టంలో కీల‌క‌మైంద‌న్నారు.

రాపాక వ‌ర‌ప్ర‌సాద్ మాట‌ల్నే తీసుకుంటే.. ఆయ‌న చేసిన ప‌నిని కూడా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయ‌లేద‌ని చెప్పాలి. తాను బ‌రిలో నిలిచే స్థానాల్లో మొద‌ట్నించి గ్రౌండ్ వ‌ర్క్ చేయ‌కున్నా.. బ‌రిలో నిలిచిన వెంట‌నే గ్రామ‌స్థాయిలో క‌మిటీల్ని ఏర్పాటు చేసినా ఫ‌లితం మ‌రోలా ఉంటుంద‌న్న అభిప్రాయం ఉంది.

తానే నేరుగా బ‌రిలో దిగుతున్న నేప‌థ్యంలో గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క‌లా భావించ‌టం.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కార‌ణంగా ప‌వ‌న్ ఓడార‌ని చెప్పాలి. రెండు స్థానాల్లో పోటీ చేయ‌టం కూడా ఓట‌మికి కార‌ణాలుగా చెప్పాలి. మొత్తంగా చూస్తే..రాపాక చెప్పిన‌ట్లుగా పునాదులు స‌రిగా లేకుండా బిల్డింగ్ క‌డితే ఏమ‌వుతుందో ప‌వ‌న్ అదే ప‌ని చేశారు. అధినేత‌కు భిన్నంగా ప్లాన్ చేయ‌టంతో రాపాక ఒకేఒక్క‌డిగా నిలిచారు.