Begin typing your search above and press return to search.

గుంటూరులో మ‌రో దారుణం.. ప‌దేళ్ల బాలిక‌పై..

By:  Tupaki Desk   |   16 May 2018 5:21 AM GMT
గుంటూరులో మ‌రో దారుణం.. ప‌దేళ్ల బాలిక‌పై..
X
గుంటూరు జిల్లా దాచేప‌ల్లి ఉదంతాన్ని మ‌ర్చిపోక ముందే మ‌రో దారుణం చోటు చేసుకుంది. ప‌దేళ్ల చిన్నారిపై ఒక యువ‌కుడు దారుణానికి పాల్ప‌డిన వైనం గుంటూరు ప‌ట్ట‌ణంలో తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఈ దారుణ ఘ‌ట‌న‌లోకి వెళితే.. పాత గుంటూరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో రాజాసింగ్ అనే యువ‌కుడు స్థానిక బేక‌రీలో ప‌ని చేస్తుంటాడు.

బేక‌రీలో ప‌ని ముగించుకొని ఇంటికి వ‌చ్చాడు. అక్క‌డే ఆడుకుంటున్న ప‌దేళ్ల చిన్నారిని త‌న‌తో ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ పాప‌పై అత్యాచార య‌త్నం చేయ‌బోవ‌టంతో భ‌యంతో బాలిక కేక‌లు పెట్టింది. చిన్నారి కేక‌ల్ని గుర్తించిన స్థానికులు రాజాసింగ్ ఇంట్లోకి వెళ్లి విష‌యం తెలుసుకొన్నారు.

అత‌డ్ని అదుపులోకి తీసుకొని దేహ‌శుద్ధి చేశారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. నిందితుడి దుర్మార్గం తెలుసుకున్న బాలిక త‌ల్లిదండ్రులు.. బంధువులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పాత గుంటూరు పోలీస్ స్టేష‌న్ ద‌గ్గ‌ర‌కు ఆందోళ‌న నిర్వ‌హించారు. నిందితుడ్ని వెంట‌నే ఉరి తీయాలంటూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆందోళ‌న‌కారుల‌కు.. పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుంది. ప‌రిస్థితి చేయి దాటి పోతుంద‌న్న ఉద్దేశంతో ప్ర‌త్యేక పోలీసుల్ని రంగంలోకి దించారు.

ఆందోళ‌న‌కారులు నిర్వ‌హించిన ఆందోళ‌న‌తో పోలీస్ స్టేష‌న్ అద్దాలు ప‌గిలిపోయాయి. రాళ్ల దాడిని మ‌రింత పెంచేస్తున్న ప‌రిస్థితుల్లో ఆందోళ‌న‌కారుల్ని ప్ర‌త్యేక పోలీసులు పోలీస్టేష‌న్ ద‌గ్గ‌ర నుంచి త‌రిమికొట్టారు. ఈ ఘ‌ట‌న‌తో గుంటూరులో తీవ్ర ఉద్రిక్త‌త‌కు తెర తీసింది.