Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మరో దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

By:  Tupaki Desk   |   10 Jun 2022 8:30 AM GMT
హైదరాబాద్ లో మరో దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
X
హైదరాబాద్ లో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వ, పోలీసుల చర్యలకు ఏమాత్రం వెరవకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. జూబ్లీహిల్స్ లో రొమేనియా బాలికపై, పహడీ షరీప్ లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారాల ఘటనలను మరువకముందే ఇంకో ఘోరం చోటు చేసుకుంది. అక్కాచెల్లెలుపై కామాంధులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. దీంతో ఆడ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

గోపాలపురం ఏసీపీ, చిలకలగూడ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వచ్చారు. కొంతకాలంగా బౌద్ధనగర్‌ డివిజన్‌ అంబర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు మైనర్‌ కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తెకు కొద్దినెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అంబర్‌పేట లాల్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ నవాజ్‌ (21) పరిచయమయ్యాడు. చాటింగ్, ఫోన్లు చేస్తూ స్నేహం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో తరచూ ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ తంతు కొద్ది రోజులుగా సాగుతోంది.

ఇదే కోవలో చిన్న కుమార్తెను కూడా అంబర్‌పేటకే చెందిన మహ్మద్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ (23) కొద్దికాలం క్రితం పరిచయం చేసుకున్నాడు. మెల్లగా మాటలు కలిపి.. ప్రేమ, పెళ్లి పేరుతో వల వేశాడు. ఈ వంకతో కొద్ది నెలలుగా బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు.

ఇటీవలే బాలికల తల్లితండ్రులకు ఈ విషయం తెలిసింది. దీంతో వారు తమ పిల్లలతో కలిసి ఈ నెల 8న చిలకలగూడ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు నిందితులపై ఐపీసీలోని అత్యాచారం సెక‌్షన్లు, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇద్దరు మైనర్లపై లైంగికదాడికి పాల్పడిన నిందితులిద్దరూ పాత నేరస్తులేనని పోలీసులు తెలిపారు. ఆటో నడిపే మహ్మద్‌ నవాజ్‌పై మలక్‌పేట, అంబర్‌పేట ఠాణాల్లో ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. పీడీ యాక్టు కింద అరెస్టై జైలుకు కూడా వెళ్లొచ్చాడని వెల్లడించారు.

అలాగే వృత్తి రీత్యా ప్లంబర్‌ అయిన మరో నిందితుడు మహ్మద్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌పై చిక్కడపల్లి, బేగంపేట, నల్లకుంట, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట, కాచిగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. అతనూ పీడీ యాక్టు కింద జైలుకు వెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు.

ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ల్లో అపరిచితుల పరిచయాలు, వారిని నమ్మి తమ వివరాలు అందజేయడం వంటివి చేయొద్దని.. వారిని గుడ్డిగా నమ్మి ఎక్కడికి వెళ్లొద్దని బాలికలకు పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డల కదలికలను పరిశీలిస్తూ ఉండాలని చెబుతున్నారు.