Begin typing your search above and press return to search.

మైనర్ పై రేప్.. చట్టం ఏం చెబుతోంది?

By:  Tupaki Desk   |   4 Jun 2022 11:30 AM GMT
మైనర్ పై రేప్.. చట్టం ఏం చెబుతోంది?
X
హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఒక మైనర్(బాలిక)పై ఐదుగురు కారులో సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపింది. ఇందులో ప్రముఖుల పిల్లలు ఉన్నారని ఆరోపణలు రావడం.. ప్రతిపక్షాలు ధర్నాలు, ఆందోళనలు చేయడంతో ఇది పెద్ద వివాదమైంది.

అయితే 18 ఏళ్లు నిండిన మేజర్లపై అత్యాచారాలు జరిగితే వాటికి ఖచ్చితమైన శిక్షలు ఉన్నాయి. మైనర్లకు ఎటువంటి శిక్షలు ఉన్నాయన్నది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు. మైనర్లపై అత్యాచారాలు.. ఒకవేళ మైనర్లే ఈ అత్యాచారాలు చేస్తే పరిస్థితి ఏంటన్నది చాలా మందికి అవగాహన లేని విషయంగా మారింది.

18 సంవత్సరాల లోపు మైనర్ బాలిక తన ఇష్టంతో శృంగారంలో పాల్గొన్నా రేప్ అవుతుంది. మైనర్ తో సెక్స్ లో పాల్గొన్నా రేప్ అవుతుంది. మైనర్ తో సెక్స్ లో పాల్గొన్న వ్యక్తికి 10 సంవత్సరాల వరకూ జైలు శిక్ష, ఫైన్.. కొన్ని సార్లు రెండూ ఉండొచ్చు.

ఒకవేళ సెక్స్ చేసింది కూడా మైనర్ బాలుడే అయితే కొద్దినెలలు జువైనల్ హోంలో ఉంచుతారు. అత్యాచారం జరిగిన కేసుల్లో దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయడంతోపాటు ట్రయల్స్ కూడా 2 నెలల్లో పూర్తి చేయాలని చట్టం ఆదేశిస్తోంది.

నిర్భయ కేసులో ఆమెపై అత్యంత పాశవికంగా ప్రవర్తించినా మైనర్ అనే కారణంతో ఓ దోషిని కేవలం 3 ఏళ్లు జువైనల్ హోంలో ఉంచి విడుదల చేశారు. మిగతా మేజర్ అయిన దోషులను ఉరితీశారు.

లైంగిక నేరాలకు వ్యతిరేకంగా సమర్థవంతమైన నిరోధం కోసం క్రిమినల్ లా చట్టం 2013న రూపొందించారు. అదేవిధంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నేరానికి మరణశిక్షతో సహా మరింత కఠినమైన శిక్ష నిబంధనలు సూచించడానికి క్రిమినల్ లా(సవరణ) చట్టం 2018ని రూపొందించడం జరిగింది.