Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లో చేరే కాంగ్రెస్ ఎంపీ ఆయ‌నేనా?

By:  Tupaki Desk   |   5 Feb 2018 8:29 AM GMT
టీఆర్ ఎస్‌ లో చేరే కాంగ్రెస్ ఎంపీ ఆయ‌నేనా?
X
తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ దాదాపు మూడేళ్ల వ‌ర‌కు ఆటుపోట్ల‌ను ఎదుర్కొని...ఇటీవ‌లే బ‌ల‌ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీకి మ‌రోమారు షాకుల ప‌రంప‌ర త‌గిలే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన అనంత‌రం వ‌రుస‌గా షాకుల ప‌రంపర ఎదుర్కొని ఇటీవ‌ల కోలుకోవ‌డ‌మే కాకుండా...ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను ఇర‌కాటంలో ప‌డేసేలా ముందుకు సాగుతున్న హ‌స్తం పార్టీని సొంత పార్టీ నేత‌లే ఇర‌కాటంలో ప‌డేసేలా చేస్తున్నార‌ని అంటున్నారు. అందులోనూ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు అధికార టీఆర్ ఎస్ పార్టీ మ‌రోమారు తెర‌లేప‌గా...కొంద‌రు నేత‌లు సైతం ఇందుకు ఓకే చెప్తున్నార‌ని తెలుస్తోంది.

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌ భవన్‌ లో నిర్వహించే ఎట్‌ హోంను కాంగ్రెస్ పార్టీ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్‌ అధికార టీఆర్‌ ఎస్‌ కు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయినప్పటికీ మాజీ మంత్రి దానం నాగేందర్‌ - ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ గవర్నర్‌ ఎట్‌ హౌం కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఉదయాన్నే ఎట్ హోం కార్యక్రమాన్ని పార్టీ బహిష్కరిస్తున్నట్టు నేతలు తెలుప‌గా...పార్టీ వద్దన్నా కూడా వారు ఎట్ హోంకు హాజరు కావడం - అక్కడ టీఆర్‌ ఎస్‌ నేతలతో కలివిడిగా ఉండటంతో కాంగ్రెస్‌ లో క‌ల‌క‌లం మొద‌లైంది. ఈ ఇద్ద‌రు నేత‌లు కాంగ్రెస్‌ పార్టీకి చేయిచ్చి...కారెక్కుతారనే ప్రచారం సాగింది.

దీంతో దీనిపై పీసీసీ ఒక‌ద‌శ‌లో సీరియ‌స్‌గానే స్పందించింది. ఆ ఇద్ద‌రు సీనియ‌ర్ల నుంచి వివ‌ర‌ణ కోరుతామ‌ని తెలిపింది. అలా వ్య‌వ‌హరించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. అయితే అంతే వేగంగా ఈ అంశం తెర‌మ‌రుగు అయిపోయింది. కాగా, ఈ ఇద్ద‌రు నేతలు గులాబీ గూటికి చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే వారు పార్టీకి ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేద‌ని విశ్లేషిస్తున్నారు. ఈ విష‌యం తెలిసే..పార్టీ కూడా వారిపై ఒత్తిడి చేయ‌లేద‌ని చెప్తున్నారు.

ఎట్ హోం కార్య‌క్ర‌మాన్ని కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించిన విషయాన్ని పార్టీ బహిరంగంగా ప్రకటించలేదని...స‌మాచారం లోపం కార‌ణంగానే తాము వెళ్లామ‌ని...విష‌యం తెలిసిన అనంత‌రం మ‌ధ్య‌లోనే వ‌చ్చామ‌ని చెప్తున్నారు. వివ‌ర‌ణ కోర‌కుండానే త‌మ‌పై ఇలాంటి ప్ర‌చారం జ‌ర‌గ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఇలాంటి ప్ర‌చారంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. కాగా, ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌మ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటుండ‌టం కొస‌మెరుపు.