Begin typing your search above and press return to search.

మోడీకి అరుదైన ఆహ్వానం..

By:  Tupaki Desk   |   17 Jan 2021 1:31 PM GMT
మోడీకి అరుదైన ఆహ్వానం..
X
భారత ప్రధాని నరేంద్రమోడీ మరో అరుదైన ఆహ్వానాన్ని అందుకున్నారు. యూకే దేశంలో నుంచి ఈ పిలుపు వచ్చింది. ఈ ఏడాది జూన్ నెలలో తమ దేశంలో జరుగనున్న జీ7 సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్రమోడీని బ్రిటన్ దేశం ఆహ్వానించింది. ఈ సదస్సుకు ముందు బ్రిటన్ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ మన దేశంలో పర్యటించే అవకాశం ఉంది. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాలకు బోరిస్ భారత్ కు అతిథిగా వస్తున్నారు.

ఈ క్రమంలోనే భారత ప్రధానిని బ్రిటన్ ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ జీ7లో సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్ తోపాటు ఆస్ట్రేలియా, దక్షిణకొరియా దేశాలను అతిథులుగా శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినట్లు యూకే హైకమిషన్ తెలిపింది.

కరోనా వైరస్, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ఈ సభ్యదేశాలు చర్చించనున్నాయి. కరోనా మహమ్మారిపై పోరులో భారత్, బ్రిటన్ దేశాలు సహకరించుకుంటున్నాయని.. ఇతర రంగాల్లో కూడా సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపింది.

బ్రిటన్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ విధించారు. బ్రిటన్ నుంచి భారత్ తోపాటు ప్రపంచదేశాలకు మహమ్మారి వైరస్ పాకి అల్లకల్లోలమైంది. మరి జీ7 దేశాల సమావేశం జరిగే జూన్ వరకైనా బ్రిటన్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయో చూడాలి మరీ.