Begin typing your search above and press return to search.

ముచ్చ‌ట‌గా మూడు వేల‌కోట్ల 'పెయింటింగ్‌'!

By:  Tupaki Desk   |   16 Nov 2017 5:23 PM GMT
ముచ్చ‌ట‌గా మూడు వేల‌కోట్ల పెయింటింగ్‌!
X
పికాసో చిత్రమా....ఎల్లోరా శిల్ప‌మా.....అంటూ ఓ సినీక‌వి పాట ర‌చించిన సంగ‌తి తెలిసిందే. నిజంగానే పికాసో గొప్ప చిత్ర‌కారుడు కాబ‌ట్టే ఆయ‌న గీసిన చిత్రాల‌కు అంత డిమాండ్ ఉంటుంది. స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా ఆయ‌న వేసే పెయింటింగ్స్ చూప‌రుల‌ను క‌ట్టిప‌డేస్తాయి. ఇక‌, క‌ళాపిపాసుల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. అందుకే, ప్ర‌ముఖ చిత్ర‌కారుడు పికాసో పెయింటింగ్స్ ను ఎంత డ‌బ్బుపెట్ట‌యినా ద‌క్కించుకునేందుకు క‌ళా తృష్ణ ఉన్న‌వారు వెనుకాడ‌రు. 2015 క్రిస్టీస్‌ నిర్వహించిన వేలంలో పికాసో వేసిన ఓ పెయింటింగ్‌ 179.4 మిలియన్‌ డాలర్లు(భార‌త క‌రెన్సీలో రూ.1171 కోట్లు) పలికింది. అయితే, తాజాగా ఆ రికార్డును మ‌రో ప్ర‌ముఖ చిత్ర‌కారుడు లియొనార్డో డావిన్సి వేసిన‌ పెయింటింగ్ బ‌ద్ద‌లు కొట్టింది.

తాజాగా, న్యూయార్క్ లో క్రిస్టీస్ సంస్థ కొన్ని చిత్ర‌ప‌టాల వేలాన్ని నిర్వ‌హించింది. ఆ వేలంలో, 500ఏళ్ల క్రితం లియోనార్డో డావెన్సీ వేసిన పెయింటింగ్ ను క‌ళ్లు చెదిరే ధ‌ర‌కు ఓ వ్య‌క్తి సొంతం చేసుకున్నాడు. డావెన్సీ వేసిన ‘సాల్వేటర్‌ ముండి’ జీసస్‌ క్రైస్ట్‌ పెయింటింగ్‌ 450.3 మిలియన్‌ డాలర్లు(భార‌త క‌రెన్సీలో రూ. 2941 కోట్లు) పలికింది. ఇప్ప‌టివ‌ర‌కు అమ్ముడైన అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా డావెన్సీ జీసస్‌ క్రైస్ట్‌ పెయింటింగ్‌ నిలిచినట్లు క్రిస్టీస్‌ వెల్లడించింది. రికార్డు ధ‌ర‌ను చెల్లించి ఆ పెయింటింగ్ ను సొంతం చేసుకున్న వ్య‌క్తి పేరు మాత్రం వెల్ల‌డి కాలేదు. ఆ వ్యక్తి ఫోన్‌ ద్వారా వేలం కార్యక్రమంలో ఈ పెయింటింగ్‌ను సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. డావెన్సీ వేసిన‌ కొన్ని ఆయిల్‌ పెయింటింగ్స్‌ 19 నిమిషాల్లో అమ్ముడ‌వ‌డం విశేషం.