Begin typing your search above and press return to search.

సుప్రీంలో అరుదైన సీన్.. 3 నెలలు.. ముగ్గురు సీజేఐలు.. ఎందుకలా?

By:  Tupaki Desk   |   27 April 2022 5:39 AM GMT
సుప్రీంలో అరుదైన సీన్.. 3 నెలలు.. ముగ్గురు సీజేఐలు.. ఎందుకలా?
X
ఇప్పటివరకు జరగలేదని చెప్పట్లేదు కానీ.. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి చోటు చేసుకుంటాయి. మరికొద్ది నెలల్లో చోటు చేసుకునే ఈ సన్నివేశం గురించి మాట్లాడుకున్నప్పుడు.. మన వ్యవస్థలో చేయాల్సిన ముఖ్యమైన మార్పు ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. దేశంలో అత్యున్నత న్యాయ సేవా సంస్థ పదవి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అలాంటి పదవిని చేపట్టిన ప్రముఖుడికి కొంతకాలమైనా ఆ పదవిలో ఉండే అవకాశం ఇవ్వాలి.

కానీ.. పదవీ విరమణ వయసు పరిమితి ఉండటంతో అలా రావటం.. ఇలా వెళ్లిపోవటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి కారణంగా.. అత్యున్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తులు.. తమదైన మార్కును చూపించేందుకు ఏ మాత్రం అవకాశం లభించని పరిస్థితి.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వచ్చే కొద్ది కాలం తర్వాత వరుసగా మూడు నెలల్లో ముగ్గురు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒకరు తర్వాత ఒకరు చొప్పున ఇద్దరు సీజేఐలు రిటైర్ కానుండటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం సీజేఐగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఈ ఆగస్టు 16తో ముగియనుంది.

తర్వాత జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నవంబరు 8 వరకు అంటే.. దాదాపు రెండు నెలల పాటు సీజేగా వ్యవహరించనున్నారు. ఆయన తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన మాత్రం రెండేళ్ల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండనున్నారు. స్వల్ప వ్యవధిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లు మారటం ఇదే తొలిసారి కానప్పటికీ.. ఈ సీన్ మాత్రం అరుదైనదిగా చెప్పక తప్పదు.


ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మన దగ్గర 65 ఏళ్లకు సుప్రీంకోర్టు సీజేగా వ్యవహరిస్తున్న వారు రిటైర్ కావాల్సి ఉంటుంది. మారిన పరిస్థితులు.. ఆరోగ్యాల నేపథ్యంలో 70 ఏళ్ల వరకు పెంచినా తప్పు లేదంటున్నారు. ఆ మాటకు వస్తే.. ఇతర దేశాల్లోని న్యాయమూర్తుల పదవీ కాలంతో పోలిస్తే భారత న్యాయమూర్తుల పదవీ కాలం బాగా తక్కువగా చెప్పాలి. యూకేలో 75 ఏళ్లు రిటైర్మెంట్ వయసు ఉంటే.. కెనడాలో 70 ఏళ్లు.. ఆస్ట్రేలియా.. బెల్జియం.. నార్వే లాంటి దేశాల్లో డెబ్భై ఏళ్ల వయసు వరకు పని చేసే అవకాశం ఉంది. ఇక.. అమెరికా-రష్యా-న్యూజిలాండ్-ఐస్ లాండ్ దేశాల్లో జడ్జిలు జీవితకాలం సేవలు అందించే వీలుంది. కానీ.. మన దగ్గర మాత్రం 65 ఏళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుంది.

తక్కువ వయసుకు రిటైర్మెంట్ కావటం వల్ల న్యాయమూర్తుల ఖాళీలు పెరిగిపోవటంతో పాటు అందుకు తగ్గట్లు భర్తీ కాని పరిస్థితి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ వ్యాజ్యాల సంఖ్య పెరిగిపోవటం.. వాటి పరిష్కరించే కాలం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీనికి కారణం న్యాయమూర్తుల కొరతతో పాటు.. న్యాయ వ్యవస్థ ఎదుర్కొనే సమస్యలకు ప్రభుత్వాలు సమాధానాలు చెప్పటం తక్కువగా ఉండటంగా చెప్పక తప్పదు. సమస్యల్ని పరిష్కరించే న్యాయవ్యవస్థకే సమస్యలు..ఇలాంటి సీన్ మన దగ్గరే ఎక్కువగా కనిపించటం గమనార్హం.