Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో అరుదైన సీన్ అవిష్కృతం

By:  Tupaki Desk   |   21 May 2022 4:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో అరుదైన సీన్ అవిష్కృతం
X
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన ఈ ఎనిమిదేళ్లలో ఎప్పుడూ చోటు చేసుకోని అరుదైన సీన్ ఒకటి అవిష్కృతమైంది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు చూడలేదంటున్నారు. కారణాలు ఏమైనా కానీ.. తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే రోజున పర్యటనలకు వెళ్లటం.. ఆ రెండు టూర్లు రాజకీయంగా చర్చనీయాంశాలుగా మారటం.. విమర్శల్ని మూట కట్టుకోవటం చూసినప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అరుదైన సీన్ ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది.

విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దావోస్ కు బయలుదేరి వెళ్లటం తెలిసిందే. సీఎం జగన్ బయలుదేరి వెళ్లిన కొద్ది గంటల తేడాతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఇలా ఒకే రోజు.. కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాజధాని ప్రాంతాల నుంచి బయలుదేరి వెళ్లిన మొదటి సందర్భం ఇదేనని చెబుతున్నారు.

నిజానికి.. తెలంగాణ సీఎం కానీ.. ఏపీ ముఖ్యమంత్రి కానీ విదేశీ పర్యటనలు.. ఢిల్లీ టూర్లు చాలా తక్కువగానే చేస్తారని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుతో పోలిస్తే.. వీరిద్దరూ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉండటం.. బయటకు వెళ్లే టూర్లు చాలా చాలా తక్కువగానే ఉండటం కనిపిస్తుంది. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే రోజున బయటకు వెళ్లటం.. ఇద్దరిది లాంగ్ ట్రిప్ కావటం గమనార్హం.

దావోస్ వెళతానన్న ఏపీ ముఖ్యమంత్రి షెడ్యూల్ కు భిన్నంగా లండన్ లో ల్యాండ్ కావటం ఆసక్తికరంగా మారటమే కాదు.. వేలెత్తి చూపించేలా మారింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. ఢిల్లీ పర్యటన కోసమని వెళుతూ.. ఏకంగా ఏడు రోజులకు పైనే రాష్ట్రానికి దూరంగా ఉండాల్సి రావటం గమనార్హం.

నిజానికి.. తెలంగాణ సీఎంవో వెల్లడించిన షెడ్యూల్ ను చూస్తే.. పది రోజులు రాష్ట్రానికి బయట ఉండాల్సినంత ముఖ్యమైన కార్యక్రమాలు ఏమీ లేవనే మాట వినిపిస్తోంది. రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలకు పరిహారం ఇవ్వటం.. అమర జవాను కుటుంబాలకు గతంలో ప్రకటించిన పరిహారాన్ని ఇవ్వటంతో పాటు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కావటం లాంటివి షెడ్యూల్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

జగన్ టూర్ షెడ్యూల్ కు భిన్నంగా దావోస్ కు వెళ్లాల్సిన ఆయన లండన్ కు వెళ్లటాన్ని తప్పు పడుతున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ మీదనా విమర్శలు ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో చోటు చేసుకునే విషాద ఉదంతాలు చోటు చేసుకుంటే పరామర్శకు కూడా వెళ్లని సీఎం.. వేరే రాష్ట్రంలో జరిగిన విషాదాల విషయంలో స్పందించటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఒకే సమయంలో బయటకు వెళ్లటం.. ఇద్దరు విమర్శలకు గురి కావటం గతంలో చోటు చేసుకోలేదంటున్నారు. ఇదో అరుదైన అంశంగా అభివర్ణిస్తున్నారు.