Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - కు అరుదైన గౌర‌వం .. పురంధేశ్వరిదేనా క్రెడిట్ ?

By:  Tupaki Desk   |   10 Jun 2022 7:31 AM GMT
ఎన్టీఆర్ - కు అరుదైన గౌర‌వం .. పురంధేశ్వరిదేనా క్రెడిట్ ?
X
ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్క‌నుంది. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న వంద రూపాయ‌ల కాయిన్ పై ఎన్టీఆర్ ముఖ చిత్రాన్ని ముద్రించి, శ‌త జ‌యంత్యుత్స‌వాల వేళ ఆయ‌న అభిమానుల‌కు ఆర్బీఐ కానుక‌గా ఇవ్వ‌నుంది. ఈ విష‌యాన్ని నిన్న‌టి వేళ తిరుప‌తిలో పురంధ‌రి వెల్ల‌డించారు.

అదేవిధంగా నాన్న‌గారికి భార‌తర‌త్న ఇవ్వాల‌ని మ‌రోమారు ప‌ట్టుబ‌ట్టారు. ఇదే సంద‌ర్భంలో నాన్న‌గారికి, తిరుప‌తికి ఉన్న అనుబంధాన్నీ గుర్తు చేసుకుని పొంగిపోయారు. వాస్త‌వానికి ఆమె ఎన్టీఆర్ విష‌యంలో ఎంతో చొర‌వ తీసుకుని రెండు మంచి ప‌నులు చేశారు.

ఒక‌టి కాంగ్రెస్ హ‌యాంలో ఆమె కేంద్ర మంత్రిగా ప‌నిచేస్తున్న స‌మ‌యంలోనే పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి, అప్ప‌టి యూపీఏ చైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీతో ఆవిష్క‌ర‌ణ చేయించి తెలుగు జాతికి అరుదైన కానుక ఇచ్చారు. ఇక్క‌డ విగ్ర‌హ ఏర్పాటు విష‌యంలో టీడీపీ కొంత మేర ప్ర‌య‌త్నించినా సంబంధిత చ‌ర్య‌లు ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. ఎన్టీఆర్ అంటే ప‌డ‌ని కాంగ్రెస్ ఆ రోజు విగ్ర‌హ ఏర్పాటు చేయ‌డం విశేషం.

త‌రువాత కాలంలో ఎన్టీఆర్ కు సంబంధిత శ‌త జ‌యంత్యుత్స‌వాల నిర్వ‌హ‌ణకు కూడా పురంధ‌రే ముందుకు వ‌చ్చి, ప‌ది నెల‌ల పాటు జ‌రిగే ఉత్స‌వ సంరంభ ప్ర‌ణాళిక‌ను వివ‌రించి, అభిమానుల‌ను మ‌రోమారు ఆకట్టుకున్నారు.

ఎన్టీఆర్ కుమార్తె గా తాజాగా చేసిన ప‌ని కూడా మంచి గుర్తింపు తెచ్చుకోనుంది. ఇవాళ బీజేపీ కీల‌క నేత‌గా ఉన్న ఆమె.. ఎన్టీఆర్ స్మ‌ర‌ణార్థం వంద రూపాయ‌ల కాయిన్ విడుద‌ల చేసే విధంగా ఆర్బీఐ ను ఒప్పించ‌డం కూడా ఓ విశేషం.

మ‌రో మంచి విష‌యం ఏంటంటే..ఆమెకు ఎన్టీఆర్ మాదిరిగానే గొప్ప వాగ్ధార ఉంది. అదేవిధంగా ప్ర‌జా స‌మ‌స్య‌లపై అవ‌గాహ‌న ఉంది. ఈ రెండూ ఆమె ఇవాళ ఓ కీల‌క నాయ‌కురాలిగా ఎదిగేందుకు,ఇంకా చెప్పాలంటే తిరుగులేని నేత‌గా రెండు జాతీయ పార్టీల‌లో రాణించేందుకు ఎంత‌గానో దోహద‌పడ్డాయి. భ‌విష్య‌త్-లో కూడా అన్న‌గారి అమ్మాయిగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. డియ‌ర్ మేడ‌మ్ ఆల్ ద బెస్ట్.