Begin typing your search above and press return to search.

లిక్కర్ బ్రాండ్ ని ప్రమోట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన రష్మిక..!

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 PM GMT
లిక్కర్ బ్రాండ్ ని ప్రమోట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన రష్మిక..!
X
పాపులర్ స్టార్స్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తమ క్రేజ్ ను వాడుకొని ఇతర బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదించడం చూస్తుంటాం. అయితే లిక్కర్ లేదా పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో నటించినప్పుడు మాత్రం విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇటీవ‌లి కాలంలో చాలా మంది స్టార్స్ వివాదాస్ప‌ద యాడ్స్ లో కనిపించి నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గురయ్యారు. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ - షారుఖ్ ఖాన్ - అజయ్ దేవగన్ కలిసి ఒక పాన్ మసాలా ప్రకటనలో నటించడం ఒక రకమైన సంచలనాన్ని సృష్టించింది.

అక్షయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలలో తాను డబ్బు కోసం ఎప్పుడూ గుట్కా బ్రాండ్స్ కు ప్రచారం చేయనని చెప్పి.. ఇప్పుడు పాన్ మసాలాను ప్రమోట్ చేయడంపై భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో అక్షయ్ తన త‌ప్పుల‌ని గ్ర‌హించి, అభిమానులకు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. ఇకపై అలాంటి బ్రాండ్స్ ను ఎప్పటికీ ప్రచారం చేయనని స్టార్ హీరో పేర్కొన్నారు.

అయితే పొగాకు ఉత్పత్తుల ప్ర‌క‌ట‌న‌లో న‌టించేందుకు నిరాకరించిన అల్లు అర్జున్ వంటి స్టార్స్ కూడా ఉన్నారు. ఏదేమైనా డ‌బ్బుల కోసం త‌ప్పుడు ప్ర‌క‌ట‌నలు చేస్తే మాత్రం అభిమానుల ఆగ్ర‌హానికి గురవ్వాల్సిందే. అందుకే సెలబ్రిటీలు అందరూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోనే విమర్శలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఓ లిక్కర్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి కింగ్‌ ఫిషర్‌ మద్యం బ్రాండ్ ప్రకటనలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇందులో వరుణ్ ధావన్ పాప్ స్టార్‌ గా కనిపిస్తాడు. అతను స్టేజీపై తనతో కలిసి డాన్స్ చేయడానికి రష్మిక మందన్నాను ఆహ్వానిస్తాడు. ఇద్దరూ కలిసి ఒక క్లబ్‌ లో డ్యాన్స్ చేస్తూ.. ఆ తర్వాత బీచ్‌ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. ఇద్దరి చేతుల్లో మద్యం బాటిల్స్ లేనప్పటికీ చీర్స్ అంటూ కింగ్ ఫిషర్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం పై అభిమానులు కలత చెందారు.

బాలీవుడ్‌ లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న రష్మిక.. ఈ కీలక సమయంలో మద్యం ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొంటోందని బాధ పడుతున్నారు. మరోవైపు ఆరోగ్యానికి హాని చేసేటువంటి లిక్కర్ బ్రాండ్ ను ఎంక‌రేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు నెటిజన్లు రష్మిక పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇండియాలో మద్యాన్ని బ్యాన్ చేయలేదు కదా.. అలాంటప్పుడు యాడ్స్ చేస్తే తప్పేంటని ఆమెను వెనకేసుకొచ్చేవారు కూడా ఉన్నారు. మరి అక్షయ్ కుమార్ మాదిరిగా రష్మిక రియలైజ్ అవుతుందో లేదా లిక్కర్ బ్రాండ్ లో నటిస్తే తప్పేంటని ప్రశ్నించి ముందుకు సాగుతుందో చూడాలి.

ఇకపోతే 'పుష్ప' తో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక.. తమిళ కన్నడ హిందీ సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో విజయ్ 'తలపతి66'.. దుల్కర్ సల్మాన్ సినిమా 'సీతా రామం' సినిమాలు ఉన్నాయి.

అలానే అల్లు అర్జున్ తో 'పుష్ప: ది రూల్' అనే పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టనుంది. ఇక హిందీలో 'మిషన్ మజ్ను' - 'గుడ్ డే' మరియు 'యానిమల్' వంటి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో రష్మిక నటిస్తోంది.