Begin typing your search above and press return to search.

ఆ టీనేజర్ బిజినెస్ లో వాటా తీసుకున్న రతన్ టాటా

By:  Tupaki Desk   |   15 Jun 2020 4:15 AM GMT
ఆ టీనేజర్ బిజినెస్ లో వాటా తీసుకున్న రతన్ టాటా
X
సాయం చేయాలన్న ఆలోచన ఉండాలే కానీ..అందుకు అండగా నిలిచేవారు చుట్టూ చాలామందే ఉంటారు. ఇప్పుడు అలాంటి ఆలోచనే ఒక టీనేజర్ కు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అతగాడి వ్యాపారంలో పెట్టుబడి పెట్టేలా చేసింది. ఇంతకీ ఆ కుర్రాడు చేసే వ్యాపారం ఏమిటి? అతడెక్కడ ఉంటాడు? లాంటి వివరాల్లోకి వెళితే..

ముంబయికి చెందిన అర్జున్ దేశ్ పాండే వయసు పద్దెనిమిదేళ్లు మాత్రమే. ఇంటర్ చదువుతూనే వ్యాపారం చేయాలన్న తపన ఎక్కువ. తన వ్యాపారం లాభాల కోసమే కాదు.. చుట్టూ ఉన్న పేదవారికి ప్రయోజనకరంగా ఉండాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా మందుల దుకాణాన్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్థికంగా ఉన్నవారు కావటంతో.. వారిని ఒప్పించి రూ.15లక్షల పెట్టుబడితో జనరిక్ ఆధార్ - ఆగ్రిగేటర్ పేరుతో స్టార్టప్ ను షురూ చేశాడు.

బయట మందుల షాపుల్లో అమ్మే ధరలకు 80 శాతం తక్కువ ధరకు మందుల్ని అమ్మటం మొదలు పెట్టాడు. దీంతో.. అతడి మందుల షాపులు పేదల ఫార్మసీలుగా మారాయి. చాలా తక్కువ వ్యవధిలోనే థానే.. ఫుణె.. ముంబయి.. కర్ణాటక.. ఒడిశా రాష్ట్రాల్లోనూ విస్తరించాడు. ప్రస్తుతం అతనికి 35 బ్రాంచులు ఉన్నాయి. మురికివాడల్లోనూ.. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తన షాపుల్ని తెరిచే వాడు.

వీధుల్లో ఉండే పేదలకు ఉచితంగా మందులు ఇచ్చేవాడు. ఇతడి వ్యాపారం గురించి అందరూ మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. చివరకు అతగాడి గురించిన సమాచారం రతన్ టాటాకు తెలిసిందే. దీంతో.. అతడి బిజినెస్ మోడల్ నచ్చిన రతన్.. తానే స్వయంగా ఆ కుర్రాడికి ఫోన్ చేశారు. తాను చేయలేని పనిని అతగాడు చేస్తున్న విషయాన్ని చెప్పటమేకాదు.. అతడి వ్యాపారంలో తాను పెట్టుబడి పెడతానని ముందుకొచ్చాడు. దీంతో.. ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి పోయాడు.

తన వ్యాపారానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పలు దేశాల్లో తిరిగాడు. అక్కడి వ్యాపారాన్ని అధ్యయనం చేసినప్పుడు.. ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశంలో మందుల ధరలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాడు. సంస్థలు తక్కువ ధరలకే మందుల్ని ఉత్పత్తి చేస్తున్నా.. వినియోగదారుడి చేతికి వచ్చేసరికి మాత్రం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. అందుకే తానీ మోడల్ లో దుకాణాల్ని స్టార్ట్ చేస్తానని చెబుతున్నాడు. ఇతగాడి ప్రయత్నానికి ప్రజల నుంచి స్పందన మాత్రమే కాదు.. పెద్ద పెద్ద సంస్థలు ముందుకొచ్చి ప్రోత్సహిస్తున్నాయి.