Begin typing your search above and press return to search.

'గుడ్ ఫెల్లోస్' ఐడియాతో రతన్ టాటా మనసు దోచేసిన కుర్రాడు

By:  Tupaki Desk   |   17 Aug 2022 4:34 AM GMT
గుడ్ ఫెల్లోస్ ఐడియాతో రతన్ టాటా మనసు దోచేసిన కుర్రాడు
X
ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని చాలా మంది ప్రముఖుల నోటి నుంచి భారత బలం ఏమిటో తెలుసా? అన్న ప్రశ్నను సంధించి..యువత అన్న సమాధానం చెబుతుంటారు. ఇవాల్టి రోజున ఉన్నయంగ్ ఇండియా.. రాబోయే రోజుల్లో పెద్ద వయస్కులతో నిండుతుంది కదా? అలాంటి వారి గురించి ఇప్పటి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నది లేదు. రానున్న మరో 20 ఏళ్లలోపెద్ద వయస్కుల అంశం పెద్ద సమస్యగా మారటమే కాదు.. ప్రభుత్వ బడ్జెట్లకు భారంగా మారనున్నాయి. ఇప్పటి యువభారత్ అప్పటికి పెద్ద వయస్కుల భారత్ గా మారుతుందన్న విషయాన్ని గుర్తించి.. అందుకు తగ్గ కార్యాచరణ లేదనే చెప్పాలి.

ఇలాంటి వేళ.. అంత దూరం ఆలోచించకున్నా..ఇప్పటి దేశంలోనూ పెద్ద వయస్కుల వెతల్ని గుర్తించి.. వారికి అండగా నిలిచేందుకు ఒకసంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవటం.. ఆ కుర్రాడి ఆలోచనలు దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మనసును దోచిన వైనం ఆసక్తికరంగా మారింది. అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి.. యువత ఆలోచనలకు అండగా నిలుస్తున్న రతన్ టాటా.. తాజాగా గుడ్ ఫెల్లోస్ అనే అంకుర సంస్థలో పెట్టుబడులు పెట్టారు.

తమ పిల్లలకు దూరంగా ఉన్న వయసు మళ్లిన పెద్ద వయస్కులకు అసరా అందించే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీనిని శంతను నాయుడు అనే కుర్రాడు ప్రారంభించాడు. ఇక్కడే ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాలి. 80లలో ఉండే రతన్ టాటాకు.. ఇరవైల్లో ఉండే శంతను మధ్య స్నేహం ఎలా కలిసింది? అన్న ప్రశ్నకు సమాధానం.. వీధి శునకాల మీద వారికున్న ప్రేమనే. అలా వారి మధ్య కలిసిన భావజాలంతో.. తన ఫ్యూచర్ ఆలోచనల్నిరతన్ టాటాకు చెప్పటం.. దానికి ఆయన తోడ్పాటు అందించేందుకు ముందుకు రావటంతో గుడ్ ఫెల్లోస్ ప్రాజెక్టు పట్టాలకు ఎక్కింది.

పెద్ద వయసు వ్యక్తులతో స్నేహంతో కలిగే ప్రయోజనాలు.. పెద్ద వయస్కుల పట్ల అప్యాయత ఈ గుడ్ ఫెల్లోస్ ను ప్రారంభించటానికి దోహదం చేసినట్లుగా శంతను చెప్పారు. ఈ సంస్థ గురించి రతన్ టాటా మాట్లాడుతూ.. ఒక తోడు ఉంటే బాగుండని కోరుకుంటూ ఒంటరిగా సమయం గడిపే వరకూ ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలీదన్నారు. చాలామంది వయసు మళ్లే వరకు వ్రద్ధాప్యం గురించి పెద్దగా పట్టించుకోరని.. కానీ ఇదో పెద్ద సవాలు అని పేర్కొన్నారు. శంతను ఆలోచనా విధానాన్ని మెచ్చుకున్న ఆయన.. అతడి స్టార్టప్ సక్సెస్ కావాలని కోరుకున్నాడు.

ఇంతకీ గుడ్ ఫెల్లోస్ సంస్థ చేసే దాని గురించి శంతను చెబుతూ.. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగిన వారిని తాము నియమించుకుంటామని.. వారు పెద్ద వయస్కుల వారికి సహచరుల మాదిరి వ్యవహరిస్తూ.. వారి ప్రతి పనిలో అసరాగా నిలుస్తారన్నారు. తాజాగా ఈ స్టార్టప్ సేవలు ముంబయిలోని 20 మందికే అందుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సంస్థను పుణె.. బెంగళూరుకు విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఏమైనా.. పెద్ద వయస్కులు..వారి అవసరాల గురించి ఆలోచించే వారు ఒకరు బయటకు రావటం.. రానున్న రోజుల్లో ఇలాంటి తీరు మరింత మందిలో వచ్చేందుకు ఈ స్టార్టప్ స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పాలి. ఇక్కడే శంతను గురించి మరో వివరాన్ని చెప్పాలి. న్యూయార్క్ లోని కార్నెల్ వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన అతగాడు.. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. అలా వారి మధ్య కుదిరిన స్నేహం ఈ రోజున అతగాడు పెట్టిన సంస్థలో పెట్టుబడి పెట్టే వరకు వెళ్లిందని చెప్పాలి.