Begin typing your search above and press return to search.

వడ్డీ రేట్లు ఎందుకు తగ్గుతాయంటే..

By:  Tupaki Desk   |   10 Nov 2016 7:42 PM GMT
వడ్డీ రేట్లు ఎందుకు తగ్గుతాయంటే..
X
500.. 1000 నోట్ల రద్దు వల్ల జనాలు తాత్కాలికంగా ఇబ్బందులు పడుతుండొచ్చు కానీ.. భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా మేలు జరుగుతుందన్నది వాస్తవం. ఆ మేలు ఎలా అన్నది ఇప్పుడు చాలామంది సందేహం. ఇకపై పెద్ద నోట్లను దాచుకుని చేసేదేం లేదు. ఎటు తిరిగీ ఆ నోట్లను బ్యాంకుల్లోకి తీసుకురావాలి. బ్లాక్ మనీని వైట్ గా మార్చడానికి నల్ల కుబేరులు కొన్ని అడ్డదారులు కూడా తొక్కుతారనడంలో సందేహం లేదు. తమ అనుచరులకు తలో రెండు మూడు లక్షలు పంచి.. వారి అకౌంట్లలోకి డబ్బులు వేయించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ల సంగతలా వదిలేస్తే.. సామాన్య జనమంతా తమ దగ్గరున్న డబ్బును బ్యాంకుల్లో వేసుకోవడం ఖాయం. దీని వల్ల బ్యాంకులకు సమృద్ధిగా డబ్బు సమకూరుతుంది. గతంతో పోలిస్తే నిల్వలు బాగా పెరుగుతాయి.

ఇకపై నోట్ల కట్టల్ని ఇళ్లల్లో దాచుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. లీగల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికే ఇష్టపడతారు. బ్యాంకుల్లో నిల్వలు భారీగా పెరుగుతాయి కాబట్టి ఇకపై లోన్లు ఈజీగా దొరుకుతాయి. అంతే కాదు.. వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశముంటుంది. మరోవైపు డబ్బుల లావాదేవీలు అధికారికంగా జరగడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. చాలా వాటి ధరలు దిగి వస్తాయి. కాబట్టి నెమ్మదిగా అయినా 500.. 1000 నోట్ల రద్దుతో చాలా మంచి పరిణామాలే జరుగుతాయి. కాబట్టి తాత్కాలిక ఇబ్బందుల్ని జనాలు భరించక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/