Begin typing your search above and press return to search.

నోరు జారి.. డీలర్ల చేతిలో పిచ్చ తిట్లు తిన్నారు

By:  Tupaki Desk   |   23 May 2015 10:54 AM GMT
నోరు జారి.. డీలర్ల చేతిలో పిచ్చ తిట్లు తిన్నారు
X
రాజకీయ నాయకులకు ఉన్న సౌలభ్యం అధికారులకు ఉండదు. ఒకరాజకీయ నాయకుడు నోరు జారి తీవ్ర వ్యాఖ్య చేసినా.. ఆయనకున్న పలుకుబడి.. అధికారం.. హోదా కారణంగా ఎందుకొచ్చిందిలే అన్నట్లుగా గొణుక్కుంటూ సర్దుకుంటారే కానీ.. నిలదీయరు. కానీ.. అధికారపక్షం నేత మాదిరి ఒక ఉన్నతాధికారి వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటనను చూస్తే అర్థమవుతుంది.

తొందరపడి ఒక మాట అని.. పది మాటలు అనిపించుకున్న క్రెడిట్‌ ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ రాజశేఖర్‌కే దక్కింది. రేషన్‌ డీలర్లు తమకున్న సమస్యలపై గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారంలో భాగంగా రేషన్‌ డీలర్ల సంఘ నాయకులతో కమిషనర్‌ రాజశేఖర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాటల మధ్యలో నోరుజారిన రాజశేఖర్‌.. ''ఇన్నాళ్లు దోచుకున్నారు. ఇప్పుడు కమిషన్‌ పెంచాలని గొడవ చేస్తున్నారు'' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో.. రేషన్‌ డీలర్లకు ఎక్కడో మండింది. రేషన్‌ డీలర్ల అవినీతిలో సింహభాగం అధికారులదే.

ప్రతి నెలా అధికారులకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నది సందు చివర ఉన్న ఏ రేషన్‌ డీలర్‌ని అడిగిన టకటకా చెప్పేస్తారు. తమ చేత బలవంతంగా లంచం వసూలు చేయటమే కాదు.. దోచుకున్నారన్న మాట వినటంలో వారిలో ఆవేశం పెల్లుబికింది.

అంతే.. రేషన్‌ డీలర్ల సంఘం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. మేం దోచుకున్నది మీలాంటి అధికారులకే ఇచ్చాం.. మీరు తినగా మిగిలిందే మేం తిన్నామని తేల్చి చెప్పటమే కాదు.. లంచాలు తీసుకున్న అధికారులు హాయిగా ఉన్నారని.. కోర్టు కేసులు మాత్రం డీలర్ల మీదే పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. రేషన్‌ డీలర్ల నేతలు ఈ రేంజ్‌లో రియాక్ట్‌ కావటంతో.. రాజశేఖర్‌ నోట మాట రాని పరిస్థితి.

నిజాయితీతో వ్యవహరించాలనుకునే ఉన్నతాధికారి.. ఎవరినో ఒకరిని టార్గెట్‌ చేసి నాలుగు మాటలు అనేసే కంటే కూడా.. కింది స్థాయి నుంచి అవినీతికి కూకటివేళ్లతో పెకిలించేలా చర్యలు తీసుకోవాలే కానీ.. ఏదో ఒక వర్గాన్ని తన మాటలతో అనేయాలనుకుంటే ఇలాంటి చేదు అనుభవమే ఎదువుతుంది మరి.