Begin typing your search above and press return to search.

జీహెచ్ ఎంసీ నిధులు మింగేస్తున్న ఎలుక‌లు!

By:  Tupaki Desk   |   24 Dec 2018 6:23 AM GMT
జీహెచ్ ఎంసీ నిధులు మింగేస్తున్న ఎలుక‌లు!
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ ఎంసీ)లో నిధులు దుర్వినియోగ‌మ‌వుతున్న తీరుకు నిద‌ర్శ‌నం ఈ వ్య‌వ‌హారం. కేవ‌లం ఒకే ఒక్క భ‌వ‌నంలో ఎలుక‌ల బెడ‌ద‌ను త‌ప్పించుకునేందుకు సంస్థ ఏకంగా రూ.2.4 ల‌క్ష‌లు వ్య‌యం చేస్తోంది. అలాగైనా మూషికాల బెడ‌ద త‌ప్పుతోందా అంటే.. అదీ లేదు. సొమ్ములు పోతున్నాయి త‌ప్ప ఎలుక‌లు పోవ‌ట్లేదు.

హైద‌రాబాద్ లో ట్యాంక్ బండ్ ప‌క్క‌న జీహెచ్ ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. ఇందులో 7 అంత‌స్థులు ఉన్నాయి. మొత్తంగా క‌లిసి దాదాపు 100 వ‌ర‌కు గ‌దులు ఉంటాయి. ఈ గ‌దుల్లో టన్నుల కొద్దీ దస్త్రాలు ఉన్నాయి. వాటిలో నగరవాసుల వివరాలు - నగరాభివృద్ధి ప్రణాళిక - భవన నిర్మాణాల అనుమతులు - ఎన్నికల - పరిపాలన - పౌరుల జనన - మరణాల వివరాలు - ఇంజినీరింగ్‌ పనులు - ఇతరత్రా ముఖ్యమైన సమాచారం ఉంటుంది. బల్దియా ఆస్తులు - ఆస్తిపన్నుకు సంబంధించిన ప‌త్రాలూ అక్క‌డే ఉన్నాయి. దాదాపు ప్రతి గదిలోనూ అటువంటి దస్త్రాల కట్టలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తుంటాయి.

అయితే - అధికారుల అల‌స‌త్వం కార‌ణంగా భ‌వ‌నంలో ఎలుక‌లు ఎక్కువ‌య్యాయి. ఆదిలోనే వాటి సంచారానికి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోవ‌డంతో ఇప్పుడు మూషికాలు భ‌వ‌నంలో స్వైర విహారం చేస్తున్నాయి. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన ముఖ్య విష‌యం ఏంటంటే.. భ‌వ‌నంలో ఎలుక‌లను ప‌ట్టేందుకు - అవి తిరిగి రాకుండా నిరాక‌రించేందుకుగాను ఓ గుత్తేదారుకు జీహెచ్ ఎంసీ ఏడాదికి ఏకంగా రూ.2.4 ల‌క్ష‌లు కేటాయిస్తోంది. అంటే నెల‌కు రూ.20 వేలు. ఆ గుత్తేదారు ఏమాత్రం చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెలియ‌దుగానీ ఎలుక‌ల స్వైర విహారం మాత్రం త‌గ్గ‌డం లేదు.

సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు.. జీహెచ్ ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం వరండాల్లో - ఫాల్స్‌ సీలింగ్‌ పై ఎలుకలు పరుగులు తీస్తూ క‌నిపిస్తున్నాయి. ఇక వాటిని వేటాడి తినేందుకు పిల్లులు కూడా వ‌స్తుండ‌టం సిబ్బందికి త‌ల‌నొప్పిగా మారుతోంది. ల‌క్ష‌ల నిధులు తీసుకుంటూ గుత్తేదారు ఎలుక‌లు ప‌ట్ట‌డంలో తీవ్ర నిర్ల‌క్ష్యం వ‌హిస్తుండ‌టంపై ఉన్న‌తాధికారులు ఇప్పుడు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మూషికాల అదుపు పేరుతో జ‌రుగుతున్న ఈ నిధుల‌ దోపిడీకి త్వ‌ర‌లోనే అడ్డుక‌ట్ట వేసేందుకు వారు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.