Begin typing your search above and press return to search.

పంపకాల్లో తేడాలు...టీడీపీ నేతల ఫైటింగులు?

By:  Tupaki Desk   |   28 Dec 2016 6:57 AM GMT
పంపకాల్లో తేడాలు...టీడీపీ నేతల ఫైటింగులు?
X
ఏపీ టీడీపీలో ఇటీవల చోటుచేసుకున్న రగడలనల్నిటికీ అవినీతే కారణమని తెలుస్తోంది. కాంట్రాక్టులు - కమీషన్ల వ్యవహారాల్లో తేడాల కారణంగానే నేతలు వీధిన పడి కొట్టుకుంటున్నారని చెబుతున్నారు. మంత్రి రావెల కిషోర్‌ బాబు - గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ ల మధ్య వివాదానికి కూడా రాజకీయ కారణాలతో పాటు ఇదే కారణమని సమాచారం. రావెలతో తనకు - కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌ పర్సన్ జానీమూన్ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. విభేదాలు తారస్థాయికి చేరడంతో పార్టీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరి మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించారు. ఆ తరువాత నేతల జోక్యంతో సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా వివాదం మాత్రం ఇంకా చల్లారలేదట.

ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప - సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి - జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులుతో కూడిన కమిటీ మంత్రి రావెల - జానీమూన్ లతో సమావేశమై వారి వాదనలను రికార్డు చేసింది. తన సొంత మండలంలో కార్యక్రమాలకు పిలవకుండా అవమానిస్తున్నారని - జెడ్పీ చైర్‌ పర్సన్‌ గా తనకు గుర్తింపులేకుండా పోయిందని జానీమూన్ కమిటీ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొన్ని సీసీ రోడ్ల నిర్మాణంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పగించి కమీషన్లు దండుకుంటున్నారని కూడా జానీమూన్ ఈ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు చెపుతున్నారు. ‘రాజకీయాల్లోకి వచ్చేది నాలుగురాళ్లు సంపాదించుకోటానికి కాదా’! అని ఇటీవల మీడియా సమావేశంలో సైతం జెడ్పీ చైర్‌ పర్సన్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

పంపకాల్లో తేడాల వల్లే మంత్రి అనుచరులు తమను బెదిరించే స్థాయికి చేరారని, నేతల మధ్య వివాదాలతో కిరాయి వ్యక్తులకు ప్రమేయం ఏమిటని నిలదీసినట్లు తెలిసింది. అయితే జానీమూన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని మంత్రి రావెల ఖండించారంటున్నారు. కాంట్రాక్టులు - కమీషన్లతో తనకు సంబంధంలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడవచ్చుకదా, పార్టీ ప్రతిష్ఠ మసకబారేలా రోడ్డుకెక్కటంలోని ఆంతర్యమేమిటని రావెల నిలదీశారట. ఇదిలావుండగా మంత్రి రావెలతో విభేదిస్తున్న గుంటూరు ఎంపిపి తోట మల్లీశ్వరి వర్గీయులు అసహనంతో ఉన్నారు. త్రిసభ్య కమిటీకి నేరుగా ఎంపిపి ఫోన్‌చేసి రోడ్డెక్కితే కానీ సమస్యను పరిష్కరించరా? రావెల తీరు వల్ల మేం నష్టపోతున్నా పట్టించుకోరేమిట’ని ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తానికి టీడీపీలో అవినీతి రోజురోజుకూ రచ్చరచ్చగా మారుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/