Begin typing your search above and press return to search.

ఇలాంటి మాటలు కదా రచ్చ మరింత పెంచేది రావెల

By:  Tupaki Desk   |   19 Jun 2016 11:48 AM GMT
ఇలాంటి మాటలు కదా రచ్చ మరింత పెంచేది రావెల
X
కీలకమైన అంశాలు.. భావోద్వేగాలకు గురి చేసే విషయాల గురించి అందరూ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. కానీ.. ఆ విషయాన్ని ఏపీ మంత్రి రావెల మర్చిపోయినట్లుగా. తన మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నియంత్రించరో కూడా అర్థం కాదు. తీవ్ర భావోద్వేగాలకు గురి చేసే తుని ఘటనకు సంబందించి ఇప్పటికే పలు సవాళ్లను ఏపీ సర్కారు ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్లుగా ఏపీ మంత్రి రావెల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత మంట పుట్టించేలా ఉన్నాయని చెప్పాలి.

తుని ఘటనలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డిల ప్రమేయం ఉందని.. వారిని త్వరలో పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ రావెల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తుని ఘటనలో నిజంగానే జగన్.. భూమాన పాత్ర ఉంటే.. దానికి సంబంధించిన కీలక సాక్ష్యాల్ని బయట పెట్టాలి. ఆ తర్వాత చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించాలే తప్పించి.. ఇష్టానుసారంగా మాట్లాడటంలో అర్థం లేదు.

తుని రైలు విధ్వంసం ఘటనలో వీరి పాత్ర ఉన్నట్లు సీఐడీ విచారణలో తేలిందన్న రావెల.. విపక్ష నేత అరెస్ట్ గురించి ప్రస్తావించటం విస్మయకరంగా మారింది. ఒకవేళ నిజంగానే జగన్ పాత్ర ఉండి ఉంటే.. ఆ విషయాల్ని రాష్ట్ర హోంమంత్రి కానీ.. ముఖ్యమంత్రి కానీ.. లేదంటే డీజీపీ కానీ వెల్లడించాలి. అంతేకానీ.. ఈ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని శాఖను నిర్వర్తిస్తున్న రావెల ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఇలాంటి బాధ్యత లేని మాటలు రాజకీయ దుమారానికి తెర తీస్తాయే తప్పించి మరెలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి అనవసర వ్యాఖ్యల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి మీద ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు.