Begin typing your search above and press return to search.

రావెలకు కాఫీ ఇచ్చి మర్యాద చేసిన జగన్

By:  Tupaki Desk   |   14 Aug 2016 4:44 AM GMT
రావెలకు కాఫీ ఇచ్చి మర్యాద చేసిన జగన్
X
ఏపీ అధికార.. ప్రధాన ప్రతిపక్షానికి మధ్య సవాలచ్చ పంచాయితీలు ఉన్నాయి. రాజకీయంగా భిన్న ధ్రువాలైనప్పటికీ.. ఒక్క విషయంలో కాకుంటే ఒక్క విషయంలో అయినా ఈ ఇద్దరూ ఒకే మాట నిలబడిన సందర్భాల్లో మచ్చుకు కనిపించని దుస్థితి. ఏపీఈ రోజు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఏపీ విపక్ష నేతగా జగన్ ఇద్దరూ బాధ్యతవహించాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఉండే వైరుధ్యం వ్యక్తిగత స్థాయికి దిగజార్చుకున్న వైనం ఇద్దరు అధినేతల్లోనూ కనిపిస్తుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా విపక్ష నేతను ఆహ్వానించాల్సిన బాధ్యత అధికారపక్షం మీద ఉంటుంది. అయితే.. ఈ విషయంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా.. తన మీద తప్పు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంఏపీ అధికార పక్షం మీదనే ఉంటుంది.

ఆ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నట్లు లేదు. పుష్కరాల ఆహ్వానం కోసం వారం ముందు నుంచి ప్రయత్నించినా.. జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటూ మంత్రి ఒకరు వ్యాఖ్యానిస్తే.. తమను అపాయింట్ మెంట్ అడిగింది ఎవరంటూ జగన్ వర్గం ప్రశ్నిస్తోంది. చివరకు.. పుష్కరాల రోజున రాత్రివేళలో జగన్ అపాయింట్ మెంట్ కోసం ఆయన ఇంటికి వెళ్లటం.. అమలాపురం పర్యటనకు వెళ్లి అలిసిపోయిన నేపథ్యంలో కలవటం కుదరదంటూ జగన్ చెప్పటంతో ఆయన నివాసం నుంచి వెనుదిరిగినట్లుగా మంత్రి రావెల అండ్ కో వెల్లడించింది.

అనంతరం.. పక్కరోజు జగన్ కు ఆహ్వానం ఇచ్చి.. ఆయన ఇచ్చిన కాఫీ తాగి మరీ బయటకు వచ్చిన మంత్రి రావెల అండ్ కో.. ఆ విషయాన్ని పెద్దగా చెప్పింది లేదు. పుష్కర ఆహ్వానం విషయంలో తమను ఏపీ అధికారపక్షం బద్నాం చేస్తుందంటూ జగన్ వర్గం తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. తన ఇంటికి వచ్చిన మంత్రి రావెల టీంకు ప్రతిపక్ష నేత ఎంత సాదరంగా ఆహ్వానించింది.. వారికి టీ ఇచ్చి మరీ మర్యాద చేసిన వైనాన్ని తెలిసేలా ఒక ఫోటోను బయట పెట్టింది.

పుష్కరాల ఆహ్వానం విషయంలో ఏపీ అధికారపక్షం తన కుసంస్కారాన్ని ప్రదర్శించిందంటూ.. జగన్ అపాయింట్ మెంట్ కోసం వారం ప్రయత్నించింది లేదని స్పష్టం చేసింది. అయినా.. జగన్ లాంటి విపక్ష నేతకు ఆహ్వానం ఇవ్వటానికి మరింత ముందేఇచ్చేసి ఉంటే ఒక పని అయిపోయేదిగా అన్న మాట వినిపిస్తోంది. ఏమైనా పుష్కర ఆహ్వానం ఎపిసోడ్ లో మంత్రి రావెల బుక్ అయినట్లుగా చెబుతున్నారు.

జగన్ ఇంటికి వెళ్లి వెయిట్ చేస్తే ఆయన తమను కలవలేదన్న విషయాన్ని చెప్పిన రావెల.. తర్వాతి రోజు ఉదయం (పుష్కరాలు మొదలైన తర్వాత) ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు జగన్ ను కలిసి ఆహ్వానం ఇచ్చి వచ్చామని మాత్రమే రావెల చెప్పారు. ఆహ్వానం ఇవ్వటానికి వెళ్లిన సందర్భంగా జగన్ ఇచ్చిన కాఫీని.. ఆయన సాదరంగా మాట్లాడిన విషయాల్ని బయటకు చెప్పలేదు. జగన్ ఇంట్లో జరిగిన దానికి భిన్నంగా ఆహ్వానం ఇచ్చే విషయంలో తాము ఎన్ని అవస్థలకు గురయ్యామో అన్న భావన వచ్చేలా రావెల మాటలు ఉన్న నేపథ్యంలో జగన్ వర్గం తెర మీదకు వచ్చింది.

ఆహ్వానం విషయంలో ఏపీ సర్కారు తప్పుల్ని ఏకరువు పెట్టటంతో పాటు.. ఇంటికి వచ్చిన అతిధికి మర్యాదలు చేసిన విషయాన్ని ప్రస్తావించకపోతే పోయారు.. అందుకు భిన్నంగా తమపై దుష్ప్రచారం మొదలు పెట్టిందంటూ జగన్ వర్గం తాజాగా తన ఇంటికి వచ్చిన రావెల టీంకు సంబంధించిన ఫోటోను అచ్చేసింది. తన ఇంటికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించినట్లుగా ఉన్న ఫోటోతో జగన్ బ్యాచ్.. ఏపీ అధికారపక్షాన్ని డిఫెన్స్ లో పడేసిన పరిస్థితి. తాజాగా బయటు వచ్చిన ఫోటోను చూసినప్పుడు పుష్కర ఆహ్వానం కోసం ఏపీ సర్కారు వారం ముందు నుంచి ప్రయత్నించిందన్న భావన కలగకుండా చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ లో అధికారపక్షం ఆహ్వానం ఇవ్వటానికి ఎంత ట్రై చేసిందన్న విషయం కంటే కూడా పుష్కరాలు స్టార్ట్ అయ్యాక జగన్ ఇంటికి వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చారన్న విషయాన్ని జనాల మైండ్ లో రిజిష్టర్ అయ్యేలా చేయటంలో జగన్ అండ్ టీం సక్సెస్ అయ్యిందనటంలో సందేహం లేదు.